Fri Nov 22 2024 19:49:35 GMT+0000 (Coordinated Universal Time)
Nallari : నల్లారి గెలుపు నల్లేరు మీద నడక కాదు.. ఎందుకంటే.. రెండు ఓట్లు.. రెండు గుర్తులు.. అదే ఇబ్బందా?
మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇది ఒకరకంగా ఆఖరి ఎన్నిక. ఇప్పటికే పదేళ్ల నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు
మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఇది ఒకరకంగా ఆఖరి ఎన్నిక. ఇప్పటికే పదేళ్ల నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ అటూ ఇటూ అయితే మాత్రం ఆయన శాశ్వతంగా హైదరాబాద్ కే పరిమితమయిపోతారు. ఈసారి రాజంపేట నుంచి పార్లమెంటు బరిలో నిలబడి తన లక్ ను పరీక్షించుకుంటున్నారు. ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో ఆఖరి బాల్ కు సిక్స్ కొట్టలన్న తరహాలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ పరిస్థితులున్నాయి. అందుకే ఆయన గెలిచారంటే ఒక రకంగా అద్భుతమనే చెప్పాలి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్న నల్లారికి గెలుపు నల్లేరు మీద నడక మాత్రం కాదు.
ఈ నియోజకవర్గంలో....
రాయలసీమలో బీజేపీ బలం చాలా తక్కువ. ఆయన ఆ పార్టీ గుర్తు మీదనే పోటీ చేస్తున్నారు. కూటమి తరుపున బరిలో ఉన్నప్పటికీ రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది 1999లోనే. ఇప్పటి వరకూ రెండు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. 1999లో గునిపాటి రామయ్య టీడీపీ నుంచి ఇక్కడ గెలవగా, 1984లో సుగవాసి పాలకొండ్రాయుడు విజయం సాధించారు. అంతే తప్ప ఇక్కడ అంతా కాంగ్రెస్ నుంచి గెలిచిన వాళ్లే. ఎందుకంటే ఇక్కడ గతంలో కాంగ్రెస్, ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ కు బలమైన ఓటు బ్యాంకు ఉంది. సామాజికవర్గాల పరంగా చూసుకున్నా ఇక్కడ టీడీపీ, బీజేపీకి పెద్ద పట్టు లేదనే చెప్పాలి.
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో...
ఇక రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ సేమ్ సీన్. ఈ నియోజకవర్గం పరిధిలో రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె, పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇందులో పీలేరులో మాత్రమే టీడీపీ బలంగా ఉంది. మిగిలిన నియోజవకర్గాల్లో అంతంత మాత్రమే. అందుకేు ఇక్కడ నల్లారి కిరిణ్ కుమార్ రెడ్డి గెలుపు అంత సులువు కాదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఏపీ విభజనకు కారణమయ్యారంటూ, ముఖ్యమంత్రి పదవి కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టారంటూ వైసీీపీ నేతలు ఇప్పటికే జనంలోకి వెళుతున్నారు. దీంతో నల్లారికి ఇక్కడ గెలుపు అంత సులువు కాదన్నది విశ్లేషకుల అంచనా.
బలమైన ప్రత్యర్థి...
మరో వైపు ప్రత్యర్థి కూడా బలమైన అభ్యర్థి కావడంతో ఆయన ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చెమటోడుస్తున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పోటీగా వైసీపీ నుంచి పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి బరిలో ఉన్నాడు. ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. నలభై ఏళ్ల నుంచి సాగుతున్న ఈ రెండు కుటుంబాల సమరంలో ఎవరిది ఈసారి గెలుపు అన్నది ఆసక్తికరంగా మారింది. ఫుల్లు వేవ్ ఉంటే తప్ప నల్లారికి గెలవలేని పరిస్థితి అంటున్నారు. అయితే గుడ్డిలో మెల్లగా జనసేన మద్దతు కొంత కలసి వస్తుందని చెబుతున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో అత్యధికంగా ఉన్న బలిజ సామాజికవర్గం ఓట్లపై నల్లారి ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. నియోజకవర్గాల్లో అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థులకు రెండు గుర్తులకు ఓటేయాల్సి రావడంతో నల్లారి గుర్తు మీదకు చేయి వెళుతుందా? అన్న అభిప్రాయమూ వ్యక్తమవుతుంది. మొత్తం మీద ఆఖరి బాల్ ను నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సిక్సర్ కు మళ్లిస్తారా? డకౌట్ అవుతారా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story