Mon Dec 23 2024 03:37:56 GMT+0000 (Coordinated Universal Time)
Ap Elections : జనం మూడ్ ఇలా ఉంది.. బటన్ నొక్కడంలో గతంలో ఎన్నడూ లేని ప్రత్యేకత ఏపీలో ఈసారి అదేందంటే?
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉంది. గత ఎన్నికల్లో తమ నియోజవకర్గంలో పోటీచేసే అభ్యర్థిని చూసి ఓటు వేసే వారు. అంతేకాదు.. స్థానికంగా ఉన్న సమస్యలు.. సామాజికవర్గం ఇలా అన్ని కోణాల్లో ఆలోచించి ఓటు వేసేవారు. ఎప్పుడూ ఏపీలో ఆ రకమైన పోలింగ్ సరళి ఉంటుంది. కానీ ఈసారి మాత్రం దానికి భిన్నంగా కనపడుతుంది. జిల్లాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి ఏపీలో ఎన్నికలు ఇప్పుడు విభిన్నంగా జరిగాయనే చెప్పాలి. ఎవరిని అడిగినా ఎమ్మెల్యే అభ్యర్థి పేరు చెప్పడం లేదు. జగన్ లేదా చంద్రబాబు అంటున్నారు తప్పించి తాము ఓటు వేసిన అభ్యర్థి పేరు చెప్పలేని పరిస్థితి నెలకొంది.
పార్టీ సింబల్ పైనే...
గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి ఉండేది కాదు. లోకల్ నాయకుడిని చూసి ఓటేసేవారు. కానీ ఈరోజు దానికి భిన్నంగా పోలింగ్ జరిగిందనే చెప్పాలి. ఎవరిని అడిగినా పార్టీ గుర్తు పేరు చెబుతున్నారు తప్పించి ఎవరూ ఫలానా అభ్యర్థికి ఓటు వేశామని చెప్పలేకపోతున్నారు. అంటే ఈసారి రూరల్ గాని.. అర్బన్ గాని కేవలం గుర్తుల ఆధారంగానే ఓటర్లు తమ ఓటును నొక్కేసి వచ్చారనుకోవాలి. తమ నియోజకవర్గం అభివృద్ధి అనే దానిని పక్కన పెట్టి తమకు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ప్రయోజనం అన్న కోణంలో ఆలోచించి మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పాలి. అంటే అటు జగన్ అన్నా కావాలి అనుకోవాలి. లేదంటే చంద్రబాబు రావాలి అనుకున్నారు తప్పించి మరో ఆలోచన ఈసారి ఓటర్లు చేయలేదన్నది గ్రౌండ్ లెవెల్ రిపోర్టు ప్రకారం అర్థమవుతుంది.
ఇద్దరూ కొత్త కాదు...
అయితే ఏపీలో కొత్తగా ఇద్దరినీ ప్రత్యేకంగా చూసేదేమీ లేదు. గతంలో చంద్రబాబు పాలనను ఐదేళ్ల పాటు చూశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే చంద్రబాబు పాలనను పథ్నాలుగేళ్ల పాటు చూశారు. దీంతో చంద్రబాబు పాలన జనాలకు కొత్తేమీ కాదు. అలాగే జగన్ పాలనను ఐదేళ్ల నుంచి చూశారు. ఈ ఇద్దరిలో తమకు ఎవరి వల్ల ఉపయోగం ఉంటుందా? అన్న కోణంలోనే ఓటర్లు ఆలోచించి బటన్ నొక్కారు తప్పించి మరేరకమైన ఆలోచన చేయలేదు. నగదు పంపిణీ పెద్దయెత్తున జరిగినప్పటికీ తాము అనుకున్న వారికి మాత్రమే ఓటు వేశారు. రూరల్ లో గాని, అర్బన్ లో గాని తమకు వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూరుస్తారు అని భావించిన వారికే ఓటర్లు మద్దతుగా నిలిచారని మాత్రం చెప్పుకోవాలి. అది ఎవరంటే చెప్పలేని పరిస్థిితి. ఏ పార్టీకి సానుకూల వాతావరణం కనిపించడం లేదు. అలాగని వ్యతిరేకత లేదు. మొత్తం మీద ఏపీలో పోలింగ్ అయితే గుంభనంగా జరిగిందనే చెప్పాలి. ఎవరు అధికారంలోకి వస్తారన్నది తెలియాలంటే మాత్రం జూన్ 4వ తేదీ వరకూ వెయిట్ చేయాల్సిందే.
Next Story