Mon Dec 23 2024 01:23:56 GMT+0000 (Coordinated Universal Time)
Pithapuram : పవన్ కు అంత సులువు కాదా? గీత మామూలుగా పోటీ ఇవ్వడం లేదటగా?
పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి పోటీ రసవత్తరంగా ఉంది. ఇద్దరు నేతల మధ్య పోటీ నువ్వా? నేనా? అన్న రీతిలో సాగనుంది
పిఠాపురం నియోజకవర్గంలో ఈసారి పోటీ రసవత్తరంగా ఉంది. ఇద్దరు నేతల మధ్య పోటీ నువ్వా? నేనా? అన్న రీతిలో సాగనుంది. ఎవరికీ గెలుపు అంత సులువు కాదన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. ఇద్దరు నేతలకు తలో రకమైన పట్టు ఉండటంతోనే ఈ పరిస్థితి నెలకొంది. పవన్ కల్యాణ్ పిఠాపురం కాకుండా భీమవరంలో నిలుచుని ఉంటే గెలుపు నల్లేరు మీద నడకలా ఉండేదన్న కామెంట్స్ కూడా జనసేన పార్టీలో వినపడుతున్నాయి. పిఠాపురంలో మారుతున్న సమీకరణాలు ఎవరికి లాభం చేకూరుస్తాయన్నది చెప్పలేని పరిస్థిితి. పిఠాపురంలో జనసేన తరుపున పవన్ కల్యాణ బరిలో ఉండగా, వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు.
సేఫ్ ప్లేస్ ను వదిలేసి....
పవన్ కల్యాణ్ ఈసారి ఒకే ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గత ఎన్నికల్లో మాదిరిగా రెండు నియోజకవర్గాలను ఎంచుకోలేదు. పిఠాపురాన్ని ఒక్కదానినే ఎంచుకుని ఆయన తప్పు చేశారా? అన్న వ్యాఖ్యలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. తిరుపతి, భీమవరం వంటి సేఫ్ ప్లేస్ వదిలేసి పవన్ పిఠాపురాన్ని ఎంచుకుని తప్పు చేశారా? అన్న అంతర్మధనం పార్టీలో సాగుతుంది. ఎందుకంటే వైసీపీ అభ్యర్థి వంగా గీతను ఆషామాషీగా తీసేయలేని పరిస్థితి. వంగా గీత సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న నేత. ఆమె భర్త విశ్వనాధ్ కూడా అందరికీ అందుబాటులో ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటారు. వంగా గీత ఇంట్లోకి పిఠాపురం ఓటర్లు ఎవరైనా నేరుగా వెళ్లే అవకాశాలున్నాయి. అందులోనూ ఆమె లోకల్. పవన్ నాన్ లోకల్ గా ముద్రపడ్డారు. వంగా గీతను ఏరికోరి అందుకే జగన్ ఎంపిక చేశారంటున్నారు. మరోవైపు సంక్షేమ పథకాలు కూడా ప్రభావం చూపనున్నాయి.
నేరుగా కలవాలన్నా...
ఏదైనా సమస్య కోసం పవన్ కల్యాణ్ ను కలవాలంటే కష్టమేనన్న భావన ఓటర్లలో నెలకొంది. అయితే యువ ఓటర్లు మాత్రం పవన్ కు మద్దతుగా ఉన్నారు. కానీ మహిళలు, వృద్ధులు, మధ్యతరగతి ఓటర్లు మాత్రం వంగా గీత వైపు ఉన్నట్లే కనిపిస్తుంది. కాపు సామాజికవర్గం ఓట్లు 90 వేలకు పైగానే ఉన్నారు. ఇద్దరూ అదే సామాజికవర్గం కావడంతో ఓట్లు చీల్చుకునే అవకాశాలున్నాయి. బీసీ ఓటర్లు 80 వేలకు పైగానే ఉన్నారు. బీసీలు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం అవుతుంది. అందులోనూ మహిళలు వంగా గీత వైపు నిలిస్తే పవన్ కల్యాణ్ గెలుపు అంత సులువు కాదన్న అంచనాలు వినిపిస్తున్నాయి. వంగా గీత పిఠాపురానికి గతంలో అభివృద్ధి చేసిన విషయాన్ని కూడా ఓటర్లు విస్మరించడం లేదు. పైగా అందుబాటులో ఉండే నేత కావడంతో ఆమె వైపు మొగ్గు చూపే అవకాశముంది.
పవన్ గెలుపు కోసం...
మరోవైపు పవన్ కల్యాణ్ ను గెలిపించుకోకపోతే కాపుల పరువు పోతుందన్న కామెంట్స్ కూడా వినపడుతున్నాయి. అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ గెలుపు అంత సులువుగా లేదన్నది అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ సారి ఎన్నికల్లో ఓటమి పాలయితే పార్టీని నడపటం అటుంచి.. నాయకుడిగా తన పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని ఆయన భావిస్తున్నారు. అందుకే ఆయన అన్ని రకాలుగా గెలుపు కోసం శ్రమిస్తున్నారు. మెగా కుటుంబం నుంచి మద్దతు కోరుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తన అన్నయ్య చిరంజీవిని కూడా రంగంలోకి దించడం కూడా అనుమానంతోనే అన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పిఠాపురంలో గెలుపు అంత సులువు కాదన్న నివేదికలు జనసేన వర్గాలను దడ పుట్టిస్తున్నాయి. పిఠాపురం నియోజకవర్గం ఓటర్ల తీర్పు ఎప్పుడూ భిన్నంగా ఉంటుంది. ఈసారి ఎవరిది గెలుపు అన్న దానిపై ఇప్పటి నుంచే పెద్దయెత్తున బెట్టింగ్ లు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి.
Next Story