Sat Dec 21 2024 11:18:39 GMT+0000 (Coordinated Universal Time)
Undi : ఉడతా ఉడతా హూచ్.. "ఉండి" టిక్కెట్ తూచ్.. ఎవరికి దక్కేనోచ్
కూటమి ఏర్పడిన తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో అసంతృప్తులున్నప్పటికీ ఉండి నియోజకవర్గం టీడీపీకి మాత్రం తలనొప్పిగా తయారైంది
కూటమి ఏర్పడిన తర్వాత మిగిలిన నియోజకవర్గాల్లో కొద్దో గొప్పో అసంతృప్తులున్నప్పటికీ ఉండి నియోజకవర్గం టీడీపీకి మాత్రం తలనొప్పిగా తయారైంది. ఉండి నియోజకవర్గం టీడీపీ టిక్కెట్ కోసం ఇప్పుడు ముగ్గురు పోటీ పడుతున్నారు. ఎవరికి రాకపోయినా మిగిలిన వాళ్లు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉండే అవకాశాలున్నాయని స్పష్టంగా తెలుస్తుంది. అందుకే ఏపీ రాజకీయాల్లో ఉండి టిక్కెట్ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి సాదాసీదాగా వెళ్లాల్సిన ఉండి నియోకవర్గంలో టిక్కెట్ కేటాయింపు నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎంట్రీతో ఒక్కసారిగా మారిపోయింది. అది ఎప్పటికి తెగుతుందో తెలియదు కానీ.. ముగ్గురు తామే కూటమి నేతలమంటూ ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.
ఉండి నియోజకవర్గం పొత్తులో భాగంగా టీడీపీకి వెళ్లిపోయింది. అక్కడ ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టిక్కెట్ కేటాయిస్తూ జాబితాలో చంద్రబాబు ప్రకటించారు. ఇందులో పెద్దగా శషబిషలు ఏమీ లేవు. ఎందుకంటే సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు గ్యారంటీ అని చంద్రబాబు చెప్పినట్లుగానే రామరాజుకు టిక్కెట్ కేటాయించారు. ఆరోజు ఉండి టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తనకు ఉండి టిక్కెట్ ఇవ్వకపోవడంతో ఆగ్రహించి ఆయన తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించాడు. అధినాయకత్వం బుజ్జగించినా ఆయన మాత్రం ఊరుకోలేదు. తన ప్రచారాన్ని తాను చేసుకుంటూ వెళుతున్నాడు.
రెండు సార్లు గెలిచి...
శివరామరాజు 2009, 2014లో రెండుసార్లు ఉండి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో ఆయనను నరసాపురం పార్లమెంటుకు పోటీ చేయడంతో ఆయన ఓడిపోయారు. మళ్లీ తన టిక్కెట్ అంటే ఉండి టిక్కెట్ తనకే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మరోవైపు 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన రామరాజు కూడా తననే కొనసాగించాలటూ ఆయన గట్టిగా తిష్ట వేసి కూర్చున్నారు. ఎందుకంటే నరసాపురం పార్లమెంటు పొత్తుల్లో భాగంగా బీజేపీకి వెళ్లిపోవడంతో రఘురామ కృష్ణరాజుకు ఉండి టిక్కెట్ ఇచ్చేందుకు టీడీపీ అధినాయకత్వం రెడీ అయింది. ఆయనను టీడీపీలో చేర్చుకుంది.
నామినేషన్ వేయడానికి....
రఘురామ కృష్ణరాజు తనకు ఉండి టిక్కెట్ ఖచ్చితంగా వస్తుందని, ఈ నెల 22న నామినేషన్ వేయనున్నానని చెబుతున్నారు. అందుకోసం తన అనుచరులను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రామరాజు తన టిక్కెట్ ను వేరెవరికైనా ఇస్తే ఊరుకునేది లేదని, ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతానని అధినాయకత్వానికి హెచ్చరికలు పంపారు. ఆయన ఇప్పటికే జనంలోకి వెళ్లి ప్రచారాన్ని చేసుకుంటున్నారు. మరో వైపు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కూడా తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉంటానని ఇప్పటికే ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు. ఇలా ఉండి నియోజకవర్గంలో ముగ్గురు రాజుల కత్తులు లేని యుద్ధం టిక్కెట్ కోసం చేసుకుంటున్నారు. మరి చివరకు ఉండి టిక్కెట్ ఎవరికి దక్కనుందన్నది ఆసక్తికరంగా మారింది.
Next Story