YSRCP : పింఛను నిలుపుదలపై తొలిసారి స్పందించిన జగన్
వైసీపీకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలను అందించామని వైసీపీ అధినేత జగన్ అన్నారు
పింఛను ఇంటికి వెళ్లి ఇవ్వాలని వాలంటీర్ల వ్యవస్థను తెస్తే చంద్రబాబు దానిపై కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారన్నారు. మదనపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తన మనుషుల చేత ఫిర్యాదు చేసి ఏప్రిల్ నెల పింఛనును ఆపేయించాడన్నారు. నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఫిర్యాదు చేయించారని ఆరోపించారు. వైసీపీకి ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలను అందించామని వైసీపీ అధినేత జగన్ అన్నారు. వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేయించే పనిని చేస్తున్నాడన్నారు. గత ఎన్నికల్లో ఓటు వేసిన వారికి కూడా పథకాలు అందించామని తెలిపారు. ఈ ప్రభుత్వం మంచి చేయకపోతే ఇంత మంది కలసి తనపై యుద్ధానికి దిగుతారా? అని ఆయన ప్రశ్నించారు. కేవలం వైసీపీకి మాత్రమే ఇంటికి వెళ్లి ఓటు వేయాలని అడిగే నైతిక హక్కు ఉందని ఆయన అన్నారు. తనను ఓడించడానికి అందరూ ఏకమవుతున్నారని అన్నారు. 99 మార్కులు వచ్చిన విద్యార్థి పరీక్షకు భయపడతాడా? పది మార్కులు రాని వారు పరీక్షల్లో పాస్ అవుతారా? అని ఆయన ప్రశ్నించారు. బీసీలను తోకకత్తిరిస్తామని చంద్రబాబు నాడు అన్న మాటలు గుర్తుకు లేవా? అని ప్రశ్నించారు.