Sun Dec 22 2024 21:57:11 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వైసీపీలో ఈ వణుకు ఏల? గ్రౌండ్ లెవెల్లో సీన్ అర్థమయిందా? ఏంది భయ్యా?
వైసీపీ నేతలకు ఓటమి భయంపట్టుకుని ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారంటున్నారు
వైసీపీ నేతలకు గెలుపు భయం పట్టుకుందా? నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి అధికారులు సహకరించలేదని చెప్పడానికి ఇదే కారణమా? అంటే అవుననే సందేహాలు కనిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో నేతలు పోలీసులు తమకు సహకరించలేదని ఆరోపిస్తున్నారు. తమకు సహకరించకపోగా, ప్రత్యర్థి పార్టీలకు అండగా నిలిచారని కూడా వారు మీడియా సమావేశాలు పెట్టి మరీ చెబుతుండటంతో వైసీపీ నేతల్లో కొంత వణుకు ప్రారంభమయిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. రీపోలింగ్ కూడా వైసీపీ నేతలే కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఓవర్ ఆల్ గా 80 శాతం వరకూ పోలింగ్ శాతం నమోదవ్వడం కూడా తమ ఓటమిని ముందే అంగీకరించేలా వైసీపీ నేతల వాదనలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
రీపోలింగ్ అంటూ...
నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా లాంటి నేతలు చేసిన వ్యాఖ్యలతో వైసీపీ విజయం పై అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం ఆ ఎన్నికల్లో అన్ని రకాలుగా సహకరించిన క్యాడర్ ను నిర్లక్ష్యం చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం నిరంతరం శ్రమించడమే కాకుండా ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అన్న క్యాడర్ నిన్న కనిపించకుండా పోవడానికి కారణం వారిని పూర్తిగా పక్కన పెట్టడమేనన్న అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేయకపోగా, వారిపై ఉన్న కేసులు విషయంలో కూడా పార్టీ నాయకత్వం పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో...
గత ఎన్నికల్లో టీడీపీతో అమితుమీ అన్న రీతిలో సిద్ధపడ్డారు. కొందరయితే తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ పార్టీ విజయానికి కారణమయ్యారు. జగన్ పాదయాత్ర నుంచి ఎన్నికల తంతు పూర్తయ్యేంత వరకూ వాళ్లు పార్టీకి అండగా నిలిచారు. వెన్నుదన్నుగా ఉన్నారు. ఆ బలం నిన్న కనిపించలేదంటున్నారు. బలగం లేకనే అనేక మంది నేతలు బలహీనంగా కనిపించారంటున్నారు. ముఖ్యమైన కార్యకర్తలు కూడా మొహం చాటేశారంటున్నారు. వీళ్లకు తాము పనిచేసినా ప్రయోజనం లేదని భావించిన ముఖ్యనేతలు కొందరు ఎన్నికలలో ముఖ్యమైన పోలింగ్ రోజున దూరంగా ఉండటమే దీనికంతటికీ కారణమని చెబుతున్నారు. అయితే ఎన్నాళ్ల నుంచో ఈ విమర్శ వైసీపీ పై వినిపిస్తుంది. క్యాడర్ ను పట్టించుకోవడం లేదని, అన్నిరకాలుగా నష్టపోయిన తమను ఆదుకోవడం లేదని సోషల్ మీడియాలో కూడా వైసీపీ నేతలు పోస్ట్ లు పెట్టారు.
క్యాడర్ ను నిర్లక్ష్యం చేయడం వల్లనేనా?
అయినా ఏమాత్రం వైసీపీ అధినాయకత్వం పట్టించుకోలేదు. తాము అమలు చేసిన సంక్షేమ పథకాలే తమకు తిరిగి అధికారం తెస్తాయన్న భావనలో ఎక్కువ మంది నేతలున్నారు. ముఖ్య నేతలు అసంతృప్తిలో ఉన్నా వారి వద్దకు వెళ్లి బతిమాలడం వంటివి చేయలేదు. వాలంటీర్లు ఉన్నారుగా .. వారు చూసుకుంటారులే అన్న ధీమాలో వైసీపీ నేతలున్నారు. అందుకే ఎలక్షనీరింగ్ లో వైసీపీ కొంత వెనకబడిందన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచే వినిపడుతున్నాయి. పోలింగ్ కేంద్రాల్లోనూ కొందరు ఏజెంట్లు అన్యమనస్కంగానే పనిచేశారని, దొంగ ఓట్లు పోలవుతున్నా పెద్దగా పట్టించుకోకపోవడానికి కూడా కారణం తమను ఐదేళ్ల నుంచి నిర్లక్ష్యంచేశారనే అంటున్నారు. మొత్తం మీద పోలింగ్ తర్వాత పోస్టుమార్టం చేసుకున్నా ఇక ప్రయోజనం ఏముంటుందన్న చర్చ సాగుతుంది. మొత్తం మీద వైసీపీ అభ్యర్థులు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు పార్టీలో కాక పుట్టిస్తున్నాయి.
Next Story