Mon Dec 23 2024 02:52:38 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మంగళగిరిలో వైఎస్ జగన్ లాస్ట్ పంచ్ అదిరిపోయిందిగా
టీడీపీ యువనేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వైఎస్ జగన్ ప్రసంగించారు.
టీడీపీ యువనేత నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరిలో వైఎస్ జగన్ ప్రసంగించారు. మరో మూడు రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగనుందని తెలిపారు. పొరపాటును చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపు పలికినట్లేనని అన్నారు. జగన్ కు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. రాబోయే ఐదేళ్లలో ఇంటింటికీ పథకాలు అందిస్తామని తెలిపారు. మ్యానిఫేస్టోలోని 99 శాతం హామీలను అమలు చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. ఈ ఐదేళ్లలో రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను ఇచ్చామన్నారు ఈ 59 నెలల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మార్పును తీసుకువచ్చామని తెలిపారు.
మార్పులు చూసి...
గ్రామాల్లో మార్పులు చూస్తే అర్థమవుతుందన్నారు. ప్రతి గ్రామంలో సచివాలయంతో పాటు రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇంటింటికీ వాలంటీర్ల ద్వారా పింఛను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదేనని అన్నారు. అక్కా చెల్లెమ్మలను ఆదుకునేందుకు అన్ని పథకాల నగదు సొమ్మును వారి ఖాతాల్లోనే వేస్తున్నామన్నారు. అక్కా చెల్లెమ్మలకు కుటుంబంలోనే కాకుండా, బయట కూడా గౌరవం పెంచేలా ఈ ఐదేళ్లు కృషి చేశామని తెలిపారు. పేదల బిడ్డలు బాగా చదువుకోవాలని విద్యారంగంలో సమూలమైన మార్పులు తెచ్చామన్నారు. ఇంగ్లీష్ మీడియంను తెచ్చి విద్యార్థులకు ట్యాబ్ లు కూడా అందించామని తెలిపారు. నాడు - నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలన్నీ బాగుపడ్డాయన్నారు.
పదిహేనేళ్ల తర్వాత...
పదిహేనేళ్ల తర్వాత ఆ పిల్లాడు ఉన్నతవిద్య చదువి అనర్గళంగా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ మంచి ఉద్యోగం చేస్తే పేదల భవిష్యత్ మారదా? అని ఆయన ప్రశ్నించారు. రైతుల కోసం రైతన్న భరోసా, ఇన్ పుట్ సబ్సిడీ, విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ ఈ ప్రభుత్వం అండగా నిలిచింది నిజం కాదా? అని నిలదీశారు. అవ్వాతాతలకు మూడు వేల రూపాయల పింఛను నేరుగా ఇంటికే చేర్చిన ఘనత మీ బిడ్డఘనత కాదా? అని ప్రశ్నించారు. వాహనమిత్ర, మత్య్సకారుల భరోసా వంటి పథకాలను అందిస్తూ పేదలను ఆదుకున్నది నిజం కాదా? అని ప్రశ్నించింది. ఆరోగ్యశ్రీ పథకం పరిమితి 25 లక్షల వరకూ పెంచడం జరిగిందన్నారు. ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని తెచ్చి ఇంటివద్దకే అందరికీ ఆరోగ్యాన్ని అందించేందుకు మీ బిడ్డ ప్రయత్నించడం నిజం కాదా? అని ప్రశ్నించారు.
సీఎంగా పనిచేసిన...
మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏనాడైనా ఇన్ని పథకాలు తెచ్చారా? అని అడిగారు. పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఈ వ్యక్తి పేరు చెబితే పేదవాడి కోసం చేసిన ఒక్క మంచిపనైనా గుర్తుకు వస్తుందా? అని అన్నారు. 2014 నుంచి 2019 వరకూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలను అమలుపర్చారా? అని అడిగారు. మళ్లీ కొత్త మ్యానిఫేస్టో డ్రామాతో మీ ముందుకు వస్తున్నారన్నారని దానిని నమ్ముతారా? అని జగన్ అన్నారు. ఇంటికి కేజీ బంగారాన్ని ఇస్తారంటే నమ్ముతారా? అని అడిగారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ అందమైన ఆశలతో మీ ముందుకు వచ్చే వారిపై ఎలాంటి కేసులు పెట్టాలని అడిగారు. జగన్ కు ప్రజల్లో మంచి పేరు వస్తుందని ఈర్ష్యతో అవ్వాతాతలకు ఇంటికి వచ్చే పింఛనును ఆపారన్నారు. ఎన్నికల కోడ్ పేరుతో పథకాలను నిలిపేశారన్నారు.
Next Story