Fri Jan 03 2025 03:48:07 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : పేదల కళ్లలో ఆనందం చూసేందుకే ఈ 59 నెలలు తపన పడ్డా
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని వైఎస్ జగన్ అన్నారు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని వైఎస్ జగన్ అన్నారు. రేపల్లెలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. మరో వారం రోజుల్లో ఎన్నికలు ఉన్నాయని, మంచి చేసిన వారికి ఓటు వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆలోచన చేయాలని, గతంలో ఏ ప్రభుత్వంలోనైనా ఇంత మంచి జరిగిందా? అని ప్రశ్నించారు. యాభై తొమ్మిది నెలల కాలంలో 2.70 లక్షల కోట్ల రూపాయలు నేరుగా జమ చేసింది మీ బిడ్డ కాదా? అని ప్రశ్నించారు. ఈ ఐదేళ్లలో చేసిన సంస్కరణలు తీసుకొస్తున్న మార్పులు ఎంత అభివృద్ధిని తెచ్చిపెట్టాయో మీకు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో అభివృద్ధి దిశగా అడుగులు వేశామని అన్నారు.
బాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు...
చంద్రబాబు పథ్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ఎప్పుడైనా ఇలాంటి పథకాలు తెచ్చి ఇంటికి ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఒక్క రూపాయి అయినా నగదును బ్యాంక్ అకౌంట్ లో వేశారా? అని అడిగారు. ఐదేళ్లలో తాను వేసిన విత్తనాలు మొక్కలుగా మారి తర్వాత చెట్లయి నీడనిస్తాయని చెప్పారు. ఈరోజు పిల్లవాడు మంచి ఉద్యోగం చేసి మీ కుటుంబంలో పేదరికాన్ని పోగొట్టాలన్నదే తన తపన అని అన్నారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టానని చెప్పానన్నారు. పేదల కళ్లల్లో ఆనందం చూడటం కోసమే ఈ యాభై తొమ్మిదినెలలు మీ బిడ్డ పనిచేశారని జగన్ గుర్తు చేశారు. మీకు మంచి జరిగితేనే ఓటు వేయాలని కోరారు.
ఫ్యాన్ కు ఓటేస్తే...
2014లో ఇదే పెద్దమనిషి చంద్రబాబు ఎన్నికలకు వెళ్లేటప్పుడు తాను సంతకం పెట్టి ప్రతి ఇంటికీ మ్యానిఫేస్టోను పంపారన్నారు. ఆ ఐదేళ్లలో ఒక్క ముఖ్యమైన హామీని అయినా అమలు చేశారా? అని చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. తాను అధికారంలోకి రాగానే ఇంటివద్దకే పింఛను, రేషన్ అందచేశానని తెలిపారు. అవ్వాతాతల గౌరవం కాపాడటానికి ప్రతి నెల ఒకటోతేదీ ఉదయాన్నే పింఛను అందించేలా చర్యలు తీసుకున్నానని తెలిపారు. ఇచ్చిన మ్యానిఫేస్టోలో 99 శాతం అమలు పర్చింది మీ బిడ్డ కాదా? అని ప్రశ్నించారు. వాహనమిత్ర, లానేస్తం, చేదోడు వంటి పథకాలు గతంలో ఉన్నాయా? అని జగన్ ప్రశ్నించారు. వైసీపీకి ఓటేస్తే మళ్లీ వాలంటీర్లు వస్తారని, ఇంటికే వచ్చి పింఛను అందిస్తారని జగన్ తెలిపారు.
Next Story