Sat Dec 21 2024 11:16:37 GMT+0000 (Coordinated Universal Time)
Ys Sharmila : షర్మిలలో భయం మొదలయిందా... ఆ ఒక్కటే ఆశ ఇక మిగిలిందా?
కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు తొలిసారి సొంత జిల్లాల్లో జనం నుంచి వినిపిస్తున్న స్పందన అర్థమవుతుంది
అవును.. కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిలకు తొలిసారి సొంత జిల్లాల్లో జనం నుంచి వినిపిస్తున్న స్పందన అర్థమవుతుంది. నాడి తెలిసిపోయినట్లుంది. ఆమె కడప నుంచి పోటీ చేయడమే అతి పెద్ద రాజకీయ సాహసమని ఆమె కూడా అంగీకరించే పరిస్థితులు నెలకొన్నాయి. తన సోదరుడు, జగన్ ను ఎదిరించి అక్కడ పోటీ చేసి నిలబడటమంటే ఆషామాషీ విషయం కాదన్నది ఆమెకు తెలిసొచ్చింది. జగన్ ను కాదని కడప జిల్లాలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తాను నెగ్గుకు రాలేనన్న సత్యం బోధపడినట్లుంది. అందుకు ఆమె రోడ్ షోలలో యువకుల నుంచి వస్తున్న అభిప్రాయాలను విని షాక్ అవుతున్నారు.
ప్రజల నుంచి...
కడప జిల్లా నుంచి ఉన్న ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా తాము ఎలా ఓటేస్తామంటూ నేరుగా ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జిషీటులో చేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరడమేంటని షర్మిల ఎదుటే మైకును తీసుకుని కొందరు ప్రశ్నిస్తుండటంతో ఆమె అవాక్కవుతున్నారు. పలుకుబడిలోనూ, ధనంలోనూ జగన్ ను ఎదుర్కొనడం.. అందులోనూ కడప గడపలో సాధ్యం కాదన్నది షర్మిలమ్మకు అర్థమయినట్లుంది. ఆమె తన చెల్లెలు వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె తో కలసి ప్రచారం చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో పెద్దగా రెస్పాన్స్ రాకపోవడాన్ని గమనించిన షర్మిలమ్మ కొంత వెనక్కు తగ్గారు.
డీకేతో భేటీ అయి...
దీంతో వైఎస్ షర్మిల కడప జిల్లా మాత్రమే కాదు ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు. తన రాజకీయ భవిష్యత్ పై ఆమె డీకే తో చర్చించినట్లు తెలిసింది. అటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాక, ఇటు ఏపీలోనూ రాదని తెలిసి తాను చేేస్తున్న ఈ సాహసానికి పార్టీ నుంచి తనకు లభించే అవకాశాలపై కూడా ఆమె కూలంకషంగా డీకే శివకుమార్ తో చర్చించినట్లు చెబుతున్నారు. ప్రచారాన్ని పక్కన పెట్టి బెంగళూరుకు వెళ్లి ప్రత్యేకంగా సమావేశమై వైఎస్ షర్మిల తన రాజకీయ పరిస్థితి గురించి కూడా ఆమె వివరించినట్లు తెలిసింది.
రాజ్యసభ ఇస్తామని...
తనకు కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారని హామీ ఇచ్చి ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా చేశారని, అయితే దానికి కూడా తాను కట్టుబడి ఉండి పార్టీ కోసం శ్రమిస్తున్నానని, అందుకు తనకు రాజకీయంగా లభించే లాభం ఏమిటన్న విషయం కూడా ఆమె డీకే తో జరిపిన చర్చల సందర్భంగా ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. షర్మిలమ్మకు ఏపీలో కాంగ్రెస్ ను కనీస స్థాయికి తీసుకెళ్లే తన ప్రయత్నం ఫలించదని కూడా తెలిసింది. సొంత జిల్లా కడపలోనే ఇలా ఉంటే రాష్ట్రం మొత్తం మీద ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఏ మేరకు ఆదరిస్తారన్నది ఆమెకు అర్థమయిందని, అందుకే ఆమె తన రాజకీయ భవిష్యత్ గురించి చర్చించడానికి హుటాహుటిన బెంగళూరు వెళ్లి డీకేతో సమావేశమయ్యారంటున్నారు. మరి షర్మిలమ్మకు ఆలస్యంగా విషయం అర్థమయిందా? కాంగ్రెస్ అధినాయకత్వం ఆదరిస్తుందా? అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.
Next Story