Mon Dec 23 2024 08:43:53 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఈసారి కప్పు ఆ జట్టుదేనట.. ఎన్ని రకాలుగా చూసినా వాళ్లే విజేతలట
ఐపీఎల్ 17వ సీజన్ గత నెల 22వ తేదీన ప్రారంభమయింది. ఇప్పటికే దాదాపు పదిహేడు మ్యాచ్ లు వరకూ పూర్తయ్యాయి.
ఐపీఎల్ 17వ సీజన్ గత నెల 22వ తేదీన ప్రారంభమయింది. ఇప్పటికే దాదాపు పదిహేడు మ్యాచ్ లు వరకూ పూర్తయ్యాయి. అయితే ఈ మ్యాచ్ లలో ఖచ్చితంగా విజయం సాధిస్తుందన్న జట్లు చేతులెత్తేస్తున్నాయి. అంచనాలు లేకుండా దిగిన జట్లు మాత్రం విజయంతో వీర విహారం చేస్తున్నాయి. కొత్త కుర్రోళ్లు చెలరేగి ఆడుతుండటంతో ఈసారి విజేత ఎవరన్న దానిపై అంచనాలు ఇప్పటి నుంచే మొదలయ్యాయి. పది జట్లు ఐపీఎల్ లో పాల్గొంటున్నాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అంచనాలు లేని జట్లు అగ్రస్థానంలో నిలిచాయి.
పాయింట్ల పట్టికలో...
పాయింట్ల పట్టికలో కోల్కత్తా అగ్రస్థానంలో నిలిచింది. ఆడిన మూడు మ్యాచ్లను గెలిచి మూడు పాయింట్లతో ముందు నిలిచింది. రన్ రేట్ లో కూడా అదే టాప్ లో నిలిచింది. 2.518 రన్ రేట్ తో నైట్ రైడర్స్ దూసుకుపోతుంది. తర్వాత స్థానం రాజస్థాన్ రాయల్స్ ఉంది. రాజస్థాన్ రాయల్స్ కూడా పాయింట్ల పట్టికలో మంచి స్థానంలోనే ఉంది. అది రెండో స్థానంలో నిలిచింది. మూడు మ్యాచ్ లు ఆడి మూడింటిలోనూ గెలిచింది. రన్ రేట్ లో 1.249 తో ద్వితీయ స్థానంలో నిలిచింది. మేటి జట్లను ఓడించి ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవడం విశేషం.
అట్టడుగున...
ఇక ఐదు సార్లు ఐపీఎల్ కప్ ను కొట్టిన ముంబయి చివరి స్థానంలో నిలిచి దాని ఫ్యాన్స్ ను పూర్తిగా నిరాశలోకి నెట్టింది. ముంబయి ఇండియన్స్ ఇప్పుడు మూడు మ్యాచ్లు ఆడి మూడింటిలోనూ ఓడింది. చివరి నుంచి రెండో స్థానంలో ఢిల్లీ ఉంది. ఢిల్లీ ఎప్పుడూ అంతే అది నాలుగు మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ లో గెలిచి రెండు పాయింట్లు సాధించింది. ఈ తర్వాత బెంగళూరు కూడా అంతే నాలుగు మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ లో గెలిచి అది కూడా రెండు పాయింట్లతో కప్పు కోసం పోరాడుతుంది.
చివరి నుంచి...
ఇక హైదరాబాద్ మూడు మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ లో గెలిచి రెండింటిలో ఓటమి పాలయింది. రన్ రేట్ లో మాత్రం ముందు భాగాన నిలిచింది. గుజరాత్ నాలుగు మ్యాచ్ లు ఆడి రెండింటిలో ఓడి రెండింటిలో గెలిచి ఫ్యాన్స్ ను ఊరిస్తుంది. పంజాబ్ కూడా అంతే నాలుగు మ్యాచ్ లు ఆడి రెండింటిలో ఓటమి పాలయి... రెండింటిలో గెలిచి ఐదో స్థానంలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ కూడా మూడు మ్యాచ్ లు ఆడి రెండింటిలో గెలిచి నాలుగు పోయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం మూడు మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ లలో గెలిచి మూడో స్థానంలో నిలిచింది. క్రీడా విశ్లేషకుల అభిప్రాయం మేరకు ఈసారి కప్పు ను రాజస్థాన్ రాయల్స్ లేదా కోల్ కత్తా నైట్ రైడర్స్ కొట్టేయవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరి ఐపీఎల్ లో ఏదైనా జరగొచ్చు కదా.. ఇప్పుడే చెప్పలేం. అయినా ఎవరి విశ్లేషణలు వారివి.
Next Story