Fri Dec 20 2024 06:40:25 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : అందుకే సామీ నువ్వు కుదురుకుంటే చాలునయ్యా.. పరాజయం పరారవ్వక మరేంటి?
పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయాన్ని నమోదు చేసుకుంది.
కింగ్ అభిమానులు ఎట్టకేలకు గ్రేట్ రిలీఫ్ దొరికింది. తొలి మ్యాచ్ లో ఓటమి పాలు కావడంతో కొంత నిరాశలో ఉన్న బెంగళూరు ఫ్యాన్స్ కు ఎండాకాలంలో కూల్ అయిన వార్తను కోహ్లి అందించాడు. నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగళూరు ఖాతాలో ఇది తొలి విజయం. తక్కువ స్కోరు అయినా వికెట్లు వరసగా పడటంతో ఛాలెంజర్స్ లో తొలుత కొంత ఆందోళన కనిపించినా మన విరాట్ దానిని ఊదిపారేశాడు.
స్వల్ప స్కోరుకే...
టాస్ గెలిచిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తొలుత ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఆరు వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేసింది. ఐపీఎల్ ఇది పెద్ద స్కోరేమీ కాదు. పంజాబ్ కింగ్స్ లో కెప్టెన్ శిఖర్ ధావన్ 37, జితేశ్ శర్మ 27 పరడులు, ప్రభ్మన్ సింగ్ 25 పరుగుల చేశారు. డెత్ ఓవర్లలో శశాంక్ సింగ్ అద్భుతంగా ఆడి సిక్సర్లు, ఫోర్లు బాదడంతో ఆ మాత్రమైనా స్కోరు పంజాబ్ కింగ్స్ రాబట్టగలిగింది. లేకుంటే మరింత తక్కువ స్కోరు నమోదయ్యేది.
లక్ష్యం చిన్నదయినా...
అయితే 177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆదిలోనే డుప్లిసెస్ వికెట్ పడటంతో కష్టాల్లో జట్టు పడిందని అనుకున్నారు. కానీ మనోడు కోహ్లి మాత్రం క్రీజుకు అంటుకుపోయాడు. కోహ్లి 77 పరుగులు చేశాడు. గ్రీన్, మ్యాక్స్వెల్ మూడు పరుగులకే అవుటయ్యారు. దీంతో దినేష్ కార్తీక్ విజృంభించి ఆడి టీంను గెలుపు బాట పట్టించాడు. కొహ్లి గెలుపు దగ్గరకు జట్టును చేరిస్తే దినేష దానిని ముగించాడు. దీంతో నాలుగు వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది.
రికార్డుల రారాజు...
కోహ్లి మరో రెండు రికార్డులను ఈ మైదానంలో సొంతం చేసుకున్నాడు. టీ 20లలో అత్యధిక యాభై పరుగులు చేసిన తొలి టీం ఇండియా ఆటగాడుగా రికార్డుకు ఎక్కాడు. వంద సార్లు యాభై ప్లస్ స్కోరు ఐపీఎల్ లో కోహ్లి చేయడం విశేషం. అలాగే ఈ మ్యాచ్ తో అత్యధిక క్యాచ్ లు అందుకున్న ఆటగాడిగా కూడా పేరు నమోదు చేసుకున్నాడు. టీం ఇండియా ప్లేయర్లలో అత్యధికంగా 173 క్యాచ్ లు అందుకుని ఆ రికార్డును కూడా విరాట్ కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు.
Next Story