Sat Dec 21 2024 16:02:10 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : గంట సేపు అదిరిపోతుందట.. అభిమానులకు అదిరిపోయే న్యూస్
రేపు సాయంత్రం చెన్నైలో ప్రారంభం కానున్న ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది
ఐపీఎల్ 2024 సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. రేపు సాయంత్రం చెన్నైలో ప్రారంభం కానున్న ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేసింది. తొలి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ సీజన్ 17 ఆరంభ వేడుకలను ఆర్భాటంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ ప్రారంభ వేడుకలకు బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహ్మాన్ తో పాటు అనేక మంది బాలీవుడ్ తారలు వస్తారని అంచనాలు వినపడుతున్నాయి. అనేక మంది ప్రముఖ సింగర్స్ ఈ ఆరంభ వేడుకల్లో పాల్గొననున్నారని తెలిసింది.
చెపాక్ స్టేడియంలో...
రేపు సరిగ్గా రాత్రి 6.30 గంటలకు ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభ వేడుకలు చెపాక్ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. గంట సేపు ఈ వేడుకలను నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. ఏఆర్ రెహ్మాన్ తో పాటు ప్రముఖ సింగర్ సోనూ నిగమ్ అభిమానులకు వీనుల విందు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్స్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు తమ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టనున్నారని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వీరితో పాటు మరికొందరు సెలబ్రిటీలు కూడా పాల్గొననున్నారు.
గంట సేపు...
ఐపీఎల్ సీజన్ 17 రేపు సాయంత్రం 6.30 గంటలకు ఆరంభ వేడుకలతో ప్రారంభమవుతుంది. దాదాపు గంట సేపు స్టేడియంలో అభిమానులను అలరించనున్నారు. గంట తర్వాత సరిగ్గా 7.30 గంటలకు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య టాస్ వేయనున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి రోజు 8 గంటలకు మ్యాచ్ ప్రారంభమయినప్పటికీ ఆ తర్వాత నుంచి 7.30 గంటలకు మ్యాచ్ లు ప్రారంభమవుతాయని నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన మ్యాచ్లకు సంబంధించిన టిక్కెట్లు అన్నీ అమ్ముడుపోయాయని నిర్వాహకులు తెలిపారు. శని, ఆదివారాలు ఎప్పటిలాగానే రోజుకు రెండు మ్యాచ్ లు జరుగుతాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి.
Next Story