Sat Nov 23 2024 02:37:07 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఈ ఆట ఆరంభం నుంచి ఏమయింది సామీ.. టెన్షన్ పెట్టారుగా?
చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది.
ఐపీఎల్ ఆరంభంలో ఈసారి ఛాంపియన్ గా గెలుస్తుందని అంచనాలు వినిపించిన జట్టు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్. అయితే వరస ఓటములతో ఆ జట్టు ఇక ప్లే ఆఫ్ కు కూడా చేరుకునే అవకాశాలు లేనట్లే కనిపించింది. ఎన్ని ఓటములు... ఎన్ని విమర్శలు... అసలు ఈ జట్టేందిరా సామీ... ఇలా తయారయింది అని ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు. ఒక్క ఓటమిని అయితే తట్టుకుంటారు. వరస ఓటములను ఎవరు మాత్రం జీర్ణించుకుంటారు. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా వరస వైఫల్యాలు ఆ జట్టును కూడా నిరాశలోకి నెట్టాయి. ఈ జట్టును సమూలంగా మార్చాల్సిందేనంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ట్రోల్స్ మామూలుగా చేయలేదు.
పెద్దయెత్తున విమర్శలు...
అందులో విరాట్ కోహ్లి ఉండటంతో ఫ్యాన్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయారు. మ్యాక్స్వెల్ పూర్తిగా వైఫల్యం చెందాడు. దీంతో పాటు బౌలర్లు కూడా ఆశించినంతగా రాణించకపోవడంతో ఓటములతోనే అది పడుతూ లేస్తూ ముందుకు వచ్చింది. అయితే లీగ్ చివరి దశకు వచ్చే సరికి జట్టు ఫామ్ లోకి వచ్చేసింది. అంతే.. ఉన్నట్లుండి ఫామ్ లోకి బ్యాటర్లు, బౌలర్లు రావడంతో వరసగా ఆరు విజయాలు సాధించింది. విరాట్ కోహ్లి, డూప్లిసెస్, రజిత్ పాటిదార్ ఇలా అందరూ వీరవిహారమే చేశారు. బౌలర్లు కూడా అందినకాడికి వికెట్లు చేజిక్కించుకోవడంతో జట్టు రాణిస్తుందన్న నమ్మకం కలిగింది. కానీ ప్లే ఆఫ్ కు చేరుతుందా? లేదా? అన్న అనుమానం మాత్రం ఉంది.
ప్లేఆఫ్ కు చేరిన...
అయితే నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ విజయం సాధించింది. టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ను ఎంచుకుంది. అదే అది చేసిన తప్పు. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇరవై ఓవర్టలో ఐదు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. ఇందులో కోహ్లి 47 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. డుప్లెసిస్ 54 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. రజిత్ పాటిదార్ 41 పరుగుల చేశాడు. దీంతో అత్యధిక స్కోరును బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ చేయగలిగింది. అయితే ఛేదనలో ఆరంభంలోనే చెన్నై సూపర్ కింగ్స్ తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ అయ్యాడు, రచిన్ మాత్రం 61 పరుగులు చేశాడు. మిచెల్ రాణించలేదు. రహానే 33 పరుగులు చేసి అవుటయ్యాడు. దూబె నిరాశపర్చాడు. జడేజా చేసిన పోరాటం ఫలించలేదు. చివరకు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసి పెవిలియన్ దారి పట్టింది. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్ కు చేరింది.
Next Story