Fri Dec 20 2024 14:30:45 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఢిల్లీ గెలిచింది..కాని ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే.. చాలా జరగాల్సిందేగా?
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ జట్టు విజయం సాధించింది
ఐపీఎల్ సీజన్ లో ప్రారంభంలో అంచనాలు అతి తక్కువగా ఉన్న జట్టు ఏది అంటే అది ఢిల్లీ కాపిటల్స్ అని మాత్రమే చెప్పాలి. కెప్టెన్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడి సుదీర్ఘకాలం తర్వాత కోలుకుని ఐపీఎల్ లోనే ఢిల్లీ కాపిటల్స్ తో మళ్లీ గేమ్ మొదలుపెట్టడంతో గతంలో ఉన్న వేగం, పెర్ఫార్మెన్స్ ఉంటాయా? అన్న అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. ప్రతి సీజన్ లోనూ ఢిల్లీ కాపిటల్స్ జట్టు పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. ప్లే ఆఫ్ కు కూడా చేరుకోని సీజన్ లు అనేకం ఉన్నాయి. అందుకే ఆ జట్టుపై ఎవరికీ అంచనాలు పెద్దగా లేవు. ఎందుకంటే దానిని ఆఖరి జట్టుగా ప్రతిఒక్కరూ లెక్కేసుకుంటూ వచ్చారు.
అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో...
కానీ అందరి లెక్కలను తలకిందులను చేస్తూ ఢిల్లీ కాపిటల్స్ ఈ సీజన్ లో తన ప్రతాపాన్ని చూపింది. ప్లే ఆఫ్ కు వస్తుందా? రాదా? అన్నది పక్కన పెడితే.. ఈ సీజన్ లో ఢిల్లీ కాపిటల్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూపించిందనే చెప్పాలి. ఎందుకంటే బలమైన జట్లను కూడా మట్టికరిపించి తమ జట్టు తీసేయడానికి లేదని, తాము చివర్లో కాదని మొదట్లో ఉండేందుకు ప్రయత్నిస్తామని ఆ జట్టు ఫ్యాన్స్ కు బలమైన భరోసాను ఇచ్చేలా ఆడింది. అందుకే ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఇప్పుడు సమిష్టి కృషితో రాణిస్తుంది. బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా బలంగా తయారైంది. అందుకే ఢిల్లీతో తలపడాలంటే మిగిలిన జట్లు కాస్త ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్లే ఆఫ్ ఛాన్స్ లు మాత్రం...
నిన్న జరిగిన లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కాపిటల్స్ జట్టు విజయం సాధించింది. ప్లేఆఫ్ రేసులో ఇంకా తానున్నానని చెప్పకనే చెప్పింది. లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి దాదాపు ముగిసినట్లే. మరో మ్యాచ్ లో గెలిచినా అది ప్లేఆఫ్ కు చేరకపోవచ్చు. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ కాపిటల్స్ జట్లు నాలుగు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. పోరెల్ 58, స్టబ్స్ 57 పరుగులు చేసి జట్టుకు మంచి స్కోరు అందించారు. అయితే తర్వాత ఛేదనలో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 9 వికెట్లు కోల్పోయి కేవలం 189 పరుగులు మాత్రమే చేసింది. ఇషాంత్ శర్మ మూడు వికెట్లు తీసి లక్నోను చావుదెబ్బతీశాడు. పూరన్ 61 పరుగులు, అర్షద్ ఖాన్ 58 పరుగులు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలయింది.
Next Story