Fri Dec 20 2024 01:48:26 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : హమ్మయ్య... ఇలా ఫస్ట్ నుంచి ఆడితే ఈ బాధ ఉండేది కాదు కదా సామీ?
చివరకు 35 పరుగుల తేడాతో బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ పై హైదరాబాద్ సన్ రైజర్స్ ఓటమి పాలయింది.
డూ ఆర్ డై మ్యాచ్ లో బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ తన సత్తా చాటింది. సమిష్టిగా రాణిస్తే విజయం దరిచేరుతుందని ఈ మ్యాచ్ చూపించింది. వరస ఓటములతో బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ బెంగ పట్టుకుంది. ప్లే ఆఫ్ కు కూడా బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ రాదేమో అని దాని అభిమానులు నిరాశలో ఉన్నారు. బ్యాటర్లు కొంత సక్సెస్ అవుతున్నప్పటికీ బౌలర్లు మాత్రం రాణించలేకపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఎనిమిది మ్యాచ్ లు ఆడితే ఒక మ్యాచ్ గెలిచి, ఏడు మ్యాచ్ లు వరసగా ఓడిపోయిందంటే అసలు ఆ జట్టు పరిస్థిితి ఎలా ఉంటుందో ఇక చెప్పాల్సిన పనిలేదు.
అనుకున్నట్లుగానే....
నిన్న జరిగిన బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో బెంగలూరు విజయం సాధించింది. అదీ హైదరాబాద్ జట్టు సొంత మైదానమైన ఉప్పల్ లో మ్యాచ్ తాను లాగేసుకుంది. టాస్ గెలిచిన బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ అందరూ అనుకున్నట్లుగానే ముందుగా బ్యాటింగ్ ను ఎంచుకుంది. విరాట్ కోహ్లి, పాటీదార్ అర్ధశతకాలతో అలరించారు. గ్రీన్ 37 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు. ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ 206 పరుగులుచేసింది. అయితే హైదరాబాద్ జట్టుకు ఇదేమీ పెద్ద స్కోరు కాదన్నది అందరికీ తెలిసిందే. అందరూ ఈస్కోరు ను ఊదిపారేస్తారని భావించారు. చివరి ఓవర్ లో తక్కువ పరుగులు చేసిన బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ ఆటగాళ్లపై ఫ్యాన్స్ ఒకింత ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు.
35 పరుగుల తేడాతో...
అయితే అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది ఐపీఎల్ ఎలా అవుతుంది. నిజానికి హైదరాబాద్ జట్టుకు ఇది స్వల్ప లక్ష్యమేనని ఎందుకు అన్నారంటే అందరూ హిట్టర్లే.. అభిషేక్ శర్మ 31 పరుగులుచేసి మరోసారి బ్యాట్ ను ఝుళిపించాడు. హెడ్ మాత్రం ఒక్కపరుగుకే అవుటయ్యాడు. మార్క్రమ్ ఏడు, నితీష 13, క్లాసెన్ ఏడు పరుగులు చేసి అవుట్ కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో పడినట్లయింది. అయితే షాబాజ్ అహ్మద్ 40 పరుగులు చేసి కొద్దిగా స్కోరు బోర్డును కదిలించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు 35 పరుగుల తేడాతో బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ పై హైదరాబాద్ సన్ రైజర్స్ ఓటమి పాలయింది. దీంతో బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ ప్లే ఆఫ్ లు సజీవంగా నిలిచాయి. ఆ జట్టు ఫ్యాన్స్ లో ఈ గెలుపుతో మరింత జోష్ పెంచింది. ఇక వరసగా ఆ జట్టు గెలిస్తేనే ప్లేఆఫ్ కు చేరుకుంటుందని విశ్లేషణలు చెబుతున్నాయి.
Next Story