Sun Dec 22 2024 18:47:53 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : క్రీడా పండితులకు సయితం నాడి అందడం లేదే.. గ్రౌండ్ లో ఈరోజు ఎవరిదంటే?
ఐపీఎల్ లో ఈరోజు ఫైనల్స్ జరుగుతుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతుంది.
ఐపీఎల్ లో ఈరోజు ఫైనల్స్ జరుగుతుంది. కోల్కత్తా నైట్ రైడర్స్ తో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడుతుంది. చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిది అన్న అంచనాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. అయితే ఇప్పటి వరకూ ఈ ఐపీఎల్ సీజన్ లో క్రీడానిపుణులకు సయితం నాడి దొరకలేదు. తాము అంచనా వేసిన జట్లు ఫైనల్స్ కు చేరుకోలేదు. అంచనాలన్నీ రాంగ్ అయ్యాయి. అందుకే ఫైనల్స్ లోనూ ఏ జట్టు గెలుస్తుందని ముందుగా అంచనా వేయడం కష్టమే. ఎందుకంటే గ్రౌండ్ లో ఆరోజు ఎవరది అన్నది ఆ రోజే నిర్ణయం జరిగిపోతుంది. ఏ ఆటగాడు చెలరేగిపోతాడు? అద్భుతంగా ఆడేస్తాడని భావిస్తే వెంటనే డకౌట్ అవ్వడం వంటివి ఐపీఎల్ లో సహజంగా జరిగేవే. బౌలర్లు కూడా అంతే. అత్యధిక పరుగులు ఇచ్చే వాళ్లే ఎక్కువ వికెట్లు తీసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేని పరిస్థితి.
కోల్కత్తా నైట్ రైడర్స్ ను...
అయితే ముందుగా కోల్కత్తా నైట్ రైడర్స్ ను తీసుకుంటే.. ఈ జట్టు సీజన్ ప్రారంభం నుంచి తడబడకుండా అడుగులు ముందుకు వేస్తుంది. గెలిచింది ఎక్కువ.. ఓడింది తక్కువ. ఈ సీజన్ లో అన్నింటికంటే నేరుగా ఫైనల్స్ కు ముందు చేరుకున్న జట్టు ఇదే. లీగ్ దశలో తొమ్మిది విజయాలను సొంతం చేసుకుందంటే కోల్కత్తా నైట్ రైడర్స్ ఫామ్ ను తక్కువగా చేసి చూడలేం. తొలి క్వాలిఫయర్ లో గెలిచి నేరుగా ఫైనల్స్ కు చేరిన ఈజట్టు ఫుల్లు ఫామ్ లో ఉందనే చెప్పాలి. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ పరంగా తీసిపారేయలేని జట్టుగా పేరు తెచ్చుకుంది. సాల్ట్, నరైన్ నిలబడ్డారంటే స్కోరు బోర్డును ఆపడం ఎవరి తరమూ కాదు. వెంకటేశ్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ లు మంచి ఫామ్ లో ఉన్నారు. రింకూ సింగ్, రసెల్ లు ఉండనే ఉన్నారు. దీంతో పాటు స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా వంటి బౌలర్లు కూడా ఉన్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ ను...
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తడబడుతూ.. లేస్తూ.. పడుతూ ఫైనల్స్ కు చేరిందనే చెప్పాలి. అయితే ఒక్కసారి ఇది విజృంభించిందంటే దీనిని నిలువరించడం సాధ్యమయ్యే పని కాదు. ఆ జట్టు అంత పటిష్టంగా ఉంది. బౌలింగ్ బలంగా ఉంది. బ్యాటింగ్ పరంగా తిరుగులేకుండా ఉంది. అందుకే ఓటములు ఎదురైనా నిలబడి.. కలబడి.. ఫైనల్స్ కు చేరుకుంది. బ్యాటింగ్ లో హెడ్, అభిషేక్ శర్మ ఐదు ఓవర్లు ఉంటే స్కోరు బోర్డు సెంచరీ దాటినట్లే. త్రిపాఠి ఫామ్ లో ఉన్నాడు. క్లాసెన్ మంచి జోరుమీదున్నాడు, షాబాద్ అహ్మద్, నితీష్ కుమార్ రెడ్డి కూడా ఫామ్ లోనే ఉన్నాడు. ఇక బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఉనద్కత్, షాబాజ్ అహ్మద్ లు బంతిని తిప్పారంటే ప్రత్యర్థికి చెమటలు తప్పవు. అందుకే ఈ మ్యాచ్ ఆద్యంతం క్రికెట్ ఫ్యాన్స్ ను అలరిస్తుందనే చెప్పాలి. చూద్దాం.. ఎవరు ఛాంపియన్ అవుతారన్నది.
Next Story