Fri Dec 20 2024 17:21:02 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : స్కై.. కోసం ఎదురు చూపులు.. వస్తే ఇక దబిడి దిబిడే
వరస ఓటములతో నీరసపడిన ముంబయి ఇండియన్స్ టీంకు గుడ్ న్యూస్. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వచ్చేస్తున్నాడు
వరస ఓటములతో నీరసపడిన ముంబయి ఇండియన్స్ టీంకు గుడ్ న్యూస్. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ వచ్చేస్తున్నాడు. స్కై వస్తే ముంబయి ఇండియన్స్ విజయాలను మొదలు పెడుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ ఐపీఎల్ సీజన్ లో ముంబయి ఇండియన్స్ ఇప్పటి వరకూ ఒక్క మ్యాచ్ లోనూ గెలవలేదు. ఆడిన అన్ని మ్యాచ్ లలో అది ఓటమి పాలయి అప్రదిష్టను మూటగట్టుకుంది. హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీపై అనేక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. బ్యాటర్లు వరసగా విఫలమవుతుండటం, బౌలర్లు రాణించలేకపోతుండటంతో ముంబయి ఇండియన్స్ ఇంతవరకూ ఒక్క విజయాన్ని నమోదు చేయకుండా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది.
అందరూ ఉన్నా...
ముంబయి జట్టులో తక్కువ హిట్టర్లు లేకుండా మాత్రం లేరు. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, హార్ధిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, నమన్ ధీర్ వంటి బ్యాటర్లున్నారు. అలాగే బుమ్రా, పియూష్ చావ్లా వంటి బౌలర్లున్నారు. అయినా ఈ సీజన్ లో అట్టర్ ఫ్లాప్ అయింది ఈ జట్టు. టీం మేనేజ్ మెంట్ సయితం ఆటగాళ్ల పెర్ఫార్మెన్స్ పై పెదవి విరుస్తూంది. ఎందుకిలా జరుగుతుందన్న మేధోమధనం జరుపుతుంది. జట్టులో మార్పులు చేస్తున్నా ఫలితం లేదు, చివరకు సొంత మైదానమైన ముంబయిలోనూ ఆ జట్టు గెలవలేకపోవడంతో ఇక ఈ సీజన్ లో అసలు ముంబయి ఇండియన్స్ సెమీ ఫైనల్స్ కు అడుగు పెడుతుందా? అన్న అనుమానాలు కూడా ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి.
ఈరోజు చివరి పరీక్ష...
అయితే ఈ తరుణంలో ముంబయి ఇండియన్స్ జట్టులో సూర్యకుమార్ యాదవ్ త్వరలో చేరుతున్నారని తెలిసింది. క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్షలో ఒకటి మినహాయించి అన్నింటా నెగ్గి మైదానంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారంటున్నారు. ఈరోజు ఆ ఒక్క పరీక్ష పూర్తయి అందులోనూ సూర్య ఫిట్ అని తేలితే ముంబయి జట్టులో స్కై చేరినట్లే. ఎన్సీఏ అనుమతి కోసం జట్టు ఎదురు చూస్తుందనే చెప్పాలి. అంతా సవ్యంగా జరిగితే ఈ నెల 7వ తేదీన ఢిల్లీ కాపిటల్స్ తో జరిగే మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ పట్టే ఛాన్స్ ఉంది. సూర్య వస్తే స్కోరు ఇక పరుగులు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ముంబయి కూడా గాడిన పడే అవకాశాలున్నాయి.
Next Story