Sat Dec 21 2024 07:47:09 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : హైదరాబాద్ ను ఆపడం ఎవరి తరం? దూసుకొస్తున్న ఆరెంజ్ ఆర్మీ
ఈ ఐపీఎల్ సీజన్ లో ఏమాత్రం అంచనాలు లేకుండా దిగిన జట్టు హైదరాబాద్ సన్ రైజర్స్
ఈ ఐపీఎల్ సీజన్ లో ఏమాత్రం అంచనాలు లేకుండా దిగిన జట్టు హైదరాబాద్ సన్ రైజర్స్. అసలు ఈ జట్టు మీద యాజమాన్యానికే నమ్మకం లేనట్లుగా మొన్నటి వరకూ ఉండేది. కానీ కెప్టెన్సీని, జెర్సీని మార్చడంతో ఒక్కసారిగా ఆ జట్టు ఐపీఎల్ లో దూసుకుపోతుంది. ప్రత్యర్థి జట్టుకు నిద్రపట్టనివ్వడం లేదు. పొరపాటున ఆరెంజ్ ఆర్మీకి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తే ఇక బాదుడే.. బాదుడు. రికార్డుల మీద రికార్డులు. తమ రికార్డులు తమే చెరిపేస్తున్న జట్టు ఇది. 277, 272, 287, 266 ఇలా పేరున్న జట్లపై పరుగుల మోత మోగించింది. ఇక అవతల జట్లు గుడ్లు తేలేయడం తప్ప చేసేదేమీ లేదు. ఇదేమి బాదుడురా సామీ అంటూ ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. కొందరయితే జట్టు యజమాని కావ్య మారన్ జాతకం మారినట్లుందని ఛలోక్తులు విసురుతున్నారు.
రికార్డుల మీద రికార్డులు...
తొలుత ముంబయి జట్టుపై 277 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో రికార్డు సృష్టించింది. తర్వాత ఆ రికార్డును బద్దలు కొట్టి బెంగలూరు రాయల్ ఛాలెంజర్స్ పై 287 పరుగులు చేసింది. మొన్నామధ్య ఢిల్లీలో మూడు వందల పరుగులు దాటుతుందని భావించారు. ఆరు ఓవర్లలో 125 పరుగులు చేయడంతో మూడు వందల పరుగులు దాటేస్తుందని అనుకున్నారు. కానీ 266 పరుగులకే పరిమితమయినా అంత స్కోరు చేయడంతో ఢిల్లీ కాపిటల్స్ చివరకు చేతులెత్తేసింది. ఇలా సన్ రైజర్స్ దూకుడు ఏ మాత్రం ఆగడం లేదు. మైదానంలో చెలరేగి ఆడుతున్నారు. అభిషేక్ శర్మ, హెడ్, క్లాసెన్, మార్క్‌క్రమ్, నితీష్ రెడ్డి, షాబాజ్ వంటి బ్యాటర్లు సిక్సర్లు బాదుతుండటంతో స్కోరు వేగాన్ని ఎవరూ ఆపలేకపోతున్నారు.
ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చి...
అసలు మొదట బ్యాటింగ్ ఇచ్చి తప్పు చేశామా? అని ప్రత్యర్థి జట్లు తలలుపట్టుకుంటున్నాయి. అందుకే హైదరాబాద్ సన్ రైజర్స్ కు మొదట బ్యాటింగ్ ఇచ్చేందుకు ఇక ఏ జట్టూ సిద్ధపడే అవకాశం కనిపించడం లేదు. మైదానం ఏదన్నది ముఖ్యం కాదు వారికి.. ఒకసారి హైదరాబాద్.. మరోసొరి బెంగలూరు.. ఇంకోసారి ఢిల్లీలో ఈ ఫీట్ ను సాధించడంతో హైదరాబాద్ సన్ రైజర్స్ అంటే మిగిలిన జట్లు షేక్ అవుతున్నాయి. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. ఏడు మ్యాచ్ లు ఆడి రెండింటిలో ఓడి ఐదింటిలో గెలిచిన హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టును ఇక ఆపేదెవరు? అన్న రీతిలో దూసుకుపోతుంది. అందుకే ఈసారి చాంపియన్ గా కూడా సన్ రైజర్స్ అని సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ తెగ పోస్టులు పెట్టేస్తున్నారు. కానీ ఇది క్రికెట్ కదా.. ఏమైనా జరగొచ్చు.
Next Story