Thu Dec 19 2024 15:53:48 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : దేవుడా... ముందుగా మాత్రం బ్యాటింగ్ రాకుండా చూడు సామీ
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తలపడుతుంది
ఐపీఎల్ లో ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ హిస్టరీని క్రియేట్ చేన్తున్న ఆరెంజ్ ఆర్మీ మరోసారి తన బ్యాట్ కు పనిచెబుతుందా? అన్నది ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్ లో చర్చనీయాంశమైంది. అసలే అది ఉప్పల్ స్టేడియం. అచ్చొచ్చిన వేదిక. అందులోనూ హోం గ్రౌండ్. ఇక వాళ్లను ఆపడం ఎవరికైనా సాధ్యమవుతుందా? అన్న అనుమానం అందరిలోనూ ఉంది. ఈరోజు రాత్రికి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లోనూ అత్యధిక పరుగులు సాధించే దిశగా సన్ రైజర్స్ ప్రయత్నించే అవకాశాలు అయితే లేకపోలేదు. అందుకు ముందుగా బ్యాటింగ్ తీసుకోవాల్సి ఉంటుంది.
టాస్ గెలిచినా...
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అదృష్టవశాత్తూ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ మాత్రం సన్ రైజర్స్ ఇవ్వవద్దంటూ ఆ జట్టు ఫ్యాన్స్ కోరుతున్నారంటే ఎంతటి దడపుట్టిస్తున్నారో ఇట్టే అర్థమవుతుంది. బౌలర్లు ఎవరైనా ఉతికి పారేయడం సన్ రైజర్స్ కు చిటికెలో పని. ఇప్పటికే పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న సన్ రైజర్స్ వరస ఓటములతో కుంగిపోయి ఉన్న రాయల్ ఛాలెంజర్స్ మీద గెలుపు కంటే రికార్డులకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశముందంటున్నారు. బెంగళూరు జట్టులో సరైన బౌలర్లు లేకపోవడం కూడా వీరికి కలసి వచ్చే అంశంగానే చూడాలంటున్నారు. ఇప్పటి వరకూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యధికంగా 287 పరుగులు సాధించింది. ఐపీఎల్ లో ఇది రికార్డు. దీనిని అధిగమించాలంటే మూడు వందల పరుగులు చేయాల్సిందేనంటున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్.
ఛాలెంజర్స్ కు సవాలే...
హైదరాబాద్ లో ఎండ వేడిమి ఎంత ఎక్కువగా ఉందో.. అంతకంటే ఎక్కువ హీట్ ఈ మ్యాచ్ పై ఉంది. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్లే ఆఫ్ కు చేరుకోవాలంటే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా విజయం సాధించాల్సిందే. అందుకే టాస్ పడితే ముందుగా తాము బ్యాటింగ్ తీసుకుని తర్వాత వారిని కట్టడి చేసే ప్రయత్నం చేయాలంటున్నారు. ఓపెనర్లుగా కొహ్లి, డూప్లిసెస్ సక్సెస్ అయితే కొంత భారీ స్కోరు చేసే అవకాశాలున్నాయి. ఇప్పటి వరక రెండు జట్లు 24 సార్లు తలపడితే అందులో పదమూడు సార్లు సన్ రైజర్స్ గెలిచింది. పది సార్లు బెంగళూరు జట్టు గెలిచింది. గణాంకాలు పెద్దగా తేడాగా లేకపోయినా సన్ రైజర్స్ జోరును ఎలా అడ్డుకుంటుందన్నది చూడాలి. అందుకే ముందుగా సన్ రైజర్స్ బ్యాటింగ్ చేయకుండా చూడాలని ఆ జట్టు ఫ్యాన్స్ కోరుకుంటున్నారంటే అతి శయోక్తి కాదు.
Next Story