Mon Dec 23 2024 08:23:23 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : రాయల్స్ అంటే అంతే మరి.. పేరును సార్థకం చేసుకుంటుందిగా
లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో చివరకు రాయల్స్ నే విజయం వరించింది.
ఈ ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు తిరుగులేదు. అన్నింటా విజయాలే. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలుపుకుంటూ దూసుకెళుతుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏ జట్టును అయినా అలవోకగా.. ఓడించేస్తుంది. ఒకరు కాకుంటే మరొకరు... అన్నట్లు రాజస్థాన్ రాయల్స్ జట్టులో ప్రతి ఒక్కరూ ఏదో ఒక మ్యాచ్ లో తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. ఐపీఎల్ తొలి సీజన్ లో ఛాంపియన్ గా అవతరించిన ఆ జట్టు తర్వాత సీజన్లో మాత్రం ఒడిదుడుకులకు లోనయింది. అయితే పదిహేడో సీజన్లో మాత్రం మళ్లీ మామూలుగా ఆడటం లేదు. ఎవరి పైనా తలవంచడం లేదు. తాను ఏంటో క్రికెట్ ఫ్యాన్స్ కు రుచి చూపిస్తుంది. కూల్ గానే ఉంటూ జట్టును విజయపథంలో నడిపిస్తూ సంజూ శాంసన్ ముందుకు తీసుకెళుతున్నాడు.
ఎనిమిదో సారి...
ఈ ఐపీఎల్ సీజన్ లో ఎనిమిదో సారి గెలిచి రాజస్థాన్ రాయల్స్ తన సత్తా ఏమిటో చూపించింది. కోల్కత్తాలో జరిగిన లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో చివరకు రాయల్స్ నే విజయం వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఇరవై ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. డికాక్ ఈ మ్యాచ్ లో కూడా విఫలమయ్యాడు. ఎనిమిది పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఎప్పటిలాగానే కెప్టెన్ ఇన్నింగ్స్ ను ఆడాడు. 76 పరుగులు చేశాడు. స్టాయినిస్ డకౌట్ అయ్యాడు, దీపక్ హుడా యాభై పరుగులు చేసి మళ్లీ ఫాంలోకి వచ్చాడని అనిపించాడు. పూరన్ 11పరుగులు చేసి అవుటయ్యాడు. బదోని 18 పరుగులు చేసి జట్టు స్కోరును పెంచాడు. రాజస్థాన్ రాయల్స్ లో సందీప్ శర్మ రెండు వికెట్లు, ఆవేష్ ఖాన్, అశ్విన్, బౌల్ట్ తలో వికెట్ తీశారు.
లక్ష్యాన్ని ఒక ఓవర్ మిగిలి ఉండగానే...
కానీ రాజస్థాన్ రాయల్స్ కు ఆ స్కోరు సరిపోదని తెలుసు. 196 పరుగులంటే పెద్ద స్కోరు ఏమీ కాదు. దీనిని అధిగమించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ 24 పరుగులు చేశాడు. బట్లర్ 34 పరుగులు చేసి అవుటయ్యాడు. కానీ మనోడు సంజూ శాంసన్ 71పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టును విజయపథాన నడిపించాడు. ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే రాజస్థాన్ రాయల్స్ లక్ష్యాన్ని అధిగమించింది. దీంతో పాయింట్ల పట్టికలో అది తన అగ్రస్థానాన్ని నిలుపుకున్నట్లయింది. ఇలా అన్ని రకాలుగా రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్స్ లో మెరుపులు మెరిపిస్తూ ముందుకు సాగుతుంది.
Next Story