Mon Dec 23 2024 02:20:32 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఈ ఐపీఎల్ సీజన్ లో పూర్తిగా డల్ అయింది పాండ్యా మాత్రమే.. ఎప్పుడూ లేనంతగా
ఐపీఎల్ 17వ సీజన్ ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు కలసి రాలేదనే చెప్పాలి
ఐపీఎల్ పదిహేడో సీజన్ ముగింపుదశకు చేరుకుంది. ప్లే ఆఫ్ కు నాలుగు జట్లు చేరుకున్నాయి. ఫైనల్స్ కు ఏ జట్టు వెళతాయన్నది పక్కన పెడితే ఈ సీజన్ లో పూర్తిగా డల్ అయింది హార్ధిక్ పాండ్యా మాత్రమే. ఎందుకంటే సీజన్ ఆరంభం నుంచి పాండ్యాకు ఈ సీజన్ కలసి రాలేదు. ఆల్ రౌండర్ గా హార్ధిక్ పాండ్యాకు పేరు. ఇటు బ్యాటింగ్ లోనూ, అటు బౌలింగ్ లోనూ పాండ్యా ఉంటే కొంత జట్టుకు ధైర్యం అనిపించేలా ఉండేది. పరుగులు తీయడంలోకాని, డెత్ ఓవర్లలో రన్ రేట్ ను సాధించడంలో గాని, బౌలింగ్ లోనూ తన సత్తా చూపుతూ అందరి మనసులను దోచుకున్నాడు. అలాంటి హార్థిక్ పాండ్యా ఒక్కసారిగా ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నాడు.
జట్టు మారి...
గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్ గా ఆ టీంను ఛాంపియన్ గా నిలిపి మరింత పేరుతెచ్చుకున్న హార్ధిక్ పాండ్యా ఈ సీజన్ లో ఆ జట్టును వదిలేసి ముంబయి ఇండియన్స్ కు షిఫ్ట్ అయ్యాడు. అదీ అప్పటి వరకూ వరసగా కప్ ను అందించిన కెప్టెన్ రోహిత్ శర్మను పక్కన పెట్టి ఆ జట్టు మేనేజ్మెంట్ హార్ధిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. అంటే అంబానీ ఫ్యామిలీకి ఎంత నమ్మకం ఉందో వేరే చెప్పాల్సిన పనిలేదు. జట్టులో కూడా బ్యాటర్లు, బౌలింగ్ పరంగా రాటుదేలిన వారుండటం కలసి వచ్చే అంశంగా భావించారు. సీజన్ ప్రారంభమయిన తొలినాళ్లలో ముంబయి ఇండియన్స్ ఖచ్చితంగా ఈ సారి కూడా ఛాంపియన్ గా నిలుస్తుందన్న అంచనాలు వినిపించాయి.
అన్ని వైఫల్యాలతో...
అనేక సార్లు ఛాంపియన్ గా నిలిచిన జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను అయితే హార్ధిక్ పాండ్యా తీసుకున్నాడు కానీ ఆది నుంచి కష్టాలే. ఎందుకో.. ఏమో తెలియదు.. తనతో పాటు జట్టు మొత్తం వైఫల్యంతో ముందుకు సాగింది. సొంత మైదానంలోనూ దానికి విజయం దక్కలేదు. చివరకు అంచనాలు తక్కువగా ఉన్న ఢిల్లీ కాపిటిల్స్ మేలు అనిపించేలా ఈ జట్టు పెర్ఫార్మెన్స్ ఉందంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. అన్నింటికంటే ముందుగా ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి పక్కకు తప్పుకుంది. జట్టుకు కెప్టెన్సీ మారడమా? లేక హార్థిక్ పాండ్యా మితి మీరిన విశ్వాసంతో బరిలోకి దిగడమా? అన్నది తెలియదు కానీ వరల్డ్ కప్ కు ముందు హార్ధిక్ పాండ్యా ఫామ్ లేమి ఈ ఐపీఎల్ సీజన్ లో కొట్టొచ్చినట్లు కనపడింది. ఈ సీజన్ లో ఎక్కువగా సోషల్ మీడియాలో ట్రోల్ అయింది కూడా హార్ధిక్ పాండ్యా కావడం విశేషం. మరి టీ 20 వరల్డ్ కప్ లోనైనా హార్ధిక్ పాండ్యా రాణిస్తాడని ఆశిద్దాం.
Next Story