Sun Nov 17 2024 15:37:40 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఇప్పుడు ఊపు వచ్చి ఏం లాభం... ప్లే ఆఫ్ ఆశలు కూడా గల్లంతయ్యాక
సన్ రైజర్స్ హైదరబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది.
ఐపీఎల్ సీజన్ ముగిసే సమయంలో ముంబయి ఇండియన్స్ కు ఇప్పుడు ఊపు వచ్చింది. ఒక సామెత ఉంది. రాచపీనుగ ఒక్కతే పోతు.. తనతో పాటు మరికొందరిని తీసుకుపోతుందన్న తరహాలో.. ఇప్పుడు ముంబయి ఇండియన్స్ తాను ప్లే ఆఫ్ కు చేరకపోయినా.. ఇప్పటి వరకూ బాగా ఆడిన సన్ రైజర్స్ హైదరాబాద్ ను తనతో పాటు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లే కనిపించింది. గెలవాల్సిన సమయంలో గెలవలేదు. అవసరం లేని సమయంలో గెలిచి మరీ తాము ఉన్నామని చెప్పుకుంటుండటం ముంబయి ఇండియన్స్ జట్టుకు మాత్రం లాభం లేదు. వ్యక్తిగతంగా ఆ జట్టులోని సభ్యులకు ఒకింత రికార్డులకోసం రానున్న వరల్డ్ కప్ కు ప్రాక్టీస్ మ్యాచ్ లుగా మాత్రమే చూడాలి
ఇది ఇప్పుడు కాదు కదా?
నిన్న సన్ రైజర్స్ హైదరబాద్ తో జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. ఇప్పుడు ముంబయి ఇండియన్స్ గెలిచినా లాభం లేదు. ఎందుకంటే రేసు నుంచి అది తప్పుకుంది. వేరే జట్లను దెబ్బకొట్టడానికే ఈ విజయం ఉపయోగపడుతుంది. ముంబయి ఇండియన్స్ పదకొండు మ్యాచ్ లు ఆడితే అందులో ఎనిమిదింటిలో ఓడింది. కేవలం మూడింటిలో మాత్రమే గెలిచిందంటే ఆ జట్టు ఎంత పేలవ ప్రదర్శన ఈ ఐపీఎల్ సీజన్ లో చేసిందో చెప్పాల్సిన పనిలేదు. తమ సొంత మైదానమైన ముంబయి వాంఖడే స్టేడియంలో సన్ రైజర్స్ ను చావుదెబ్బ తీసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్లీ రికార్డు స్థాయిలో పరుగులు చేస్తుందని భావించారు. కానీ సన్ రైజర్స్ ను కట్టడి చేయడంలో ముంబయి ఇండియన్స్ బౌలర్లు సక్సెస్ అయ్యారు.
స్కై సెంచరీతో...
ఓపెనర్లుగా దిగిన సన్ రైజర్స్ ఆటగాళ్లలో అభిషేక్ శర్మ పదకొండు పరుగులకే అవుటయ్యాడు. హెడ్ 48 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. మయాంక్ ఐదు పరుగులకే వెనుదిరిగాడు. నితీష్ రెడ్డి ఇరవై పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. క్లాసెన్ కూడా రెండు పరుగులకే అవుట్ కావడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 173 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ లో ఇషాన్, రోహిత్ శర్మ మరోసారి నిరాశపరచారు. ఇషాన్ తొమ్మిది పరుగులు చేయగా, రోహిత్ శర్మ నాలుగు పరుగులకే అవుటయ్యాడు. నమన్ డకౌట్ అయ్యాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ మాత్రం నిలదొక్కుకుని సెంచరీ చేశాడు. 102 పరుగులు చేశాడు. తిలక్ వర్మ సూర్యకు సహకరించాడు. 37 పరుగులు చేశాడు. కేవలం 17.2 ఓవర్లలోనే ముంబయి ఇండియన్స్ మ్యాచ్ ముగించేశారు.
Next Story