Mon Dec 23 2024 09:07:36 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : మళ్లీ మనోడే ఇరగదీశాడుగా.. నితీష్ కుమార్ రెడ్డి వల్లనేగా ఈ గెలుపు
సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడి రాయల్స్ ఓటమి పాలయింది.
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందు బ్యాటింగ్కు దిగితే దానిని ఎవరూ ఆపలేరని మరోసారి నిరూపితమయింది. అందుకే టాస్ గెలిచిన జట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కు ముందు బ్యాటింగ్ అప్పజెప్పకుండా తామే బ్యాట్ ను అందుకుంటున్నారు. వాళ్లను ఫీల్డింగ్ కు దించుతున్నారు. ఛేజింగ్ లో ఆ జట్టును దెబ్బతీయడం సులువుగా మారుతుందని భావించి గత రెండు మ్యాచ్ లలో అదే చేశాయి. అందుకే సన్ రైజర్స్ హైదరాబాద్ వరసగా రెండు మ్యాచ్ లలో ఓటమి పాలయింది. మొన్నటి వరకూ రికార్డుల మీద రికార్డులను నమోదు చేస్తూ తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ వెళుతున్న ఈ జట్టుకు వరస విజయాలకు బ్రేక్ పడటం ఒకింత ఆ జట్టు ఫ్యాన్స్ ను నిరాశపర్చింది.
మనోడు మళ్లీ...
అయితే నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్థాన్ రాయల్స్ తలపడి రాయల్స్ ఓటమి పాలయింది. అయితే ఈ గెలుపులో మన తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడంటే అతి శయోక్తి కాదు. చివరి బంతి వరకూ టెన్షన్ పెట్టినా చివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ నే విజయాన్ని వరించింది. రాజస్థాన్ రాయల్స్ జోరుకు బ్రేకులు వేయగలిగింది. చివరి బంతికి రెండు పరుగులు మాత్రమే రాజస్థాన్ రాయల్స్ చేయాల్సి ఉన్నా భువనేశ్వర్ దెబ్బకు ఆ జట్టు ఓటమి పాలయింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదిలో కొంత తడబడింది. హెడ్ 58 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ 12 పరుగులకే అవుటయ్యాడు. అన్మోల్ ప్రీత్ ఐదు పరుగులకే వెనుదిరిగాడు. దీంతో తక్కువ స్కోరు నమోదు చేస్తుందని భావించారు. కానీ నితీష్ కుమార్ రెడ్డి 76 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టు స్కోరును పెంచాడు. ఇరవై ఓవర్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ మూడు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది.
చివరి బంతికి...
కానీ రాజస్థాన్ రాయల్స్ కు ఇది పెద్ద స్కోరు ఏమీ కాదు. ఊదిపారేయడం గ్యారంటీ అనుకున్నారంతా. కానీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు చివరి బంతి వరకూ కొంత టెన్షన్ తప్పలేదు. ఒక్క పరుగుకే రెండు వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ పరాగ్, యశస్వి జైశ్వాల్ నిలదొక్కుకోవడంతో గెలుపు గ్యారంటీ అనుకున్నారంతా. పావెల్ కూడా విజృంభించి ఆడాడు. యశస్వి జైశ్వాల్ 67 పరుగులు చేశాడు. బట్లర్ డకౌట్ అయ్యాడు. శాంసన్ కూడా జీరో పరుగులకే వెనుదిరిగాడు. కానీ పరాగ్ 77 పరుగులు చేశాడు. హెట్ మెయర్ 13 పరుగులు చేసి వెనుదిరిగాడు. పావెల్ చివరి బంతికి రెండు పరుగులు చేస్తే రాజస్థాన్ రాయల్స్ కు విజయమే వరించింది. కనీసం ఒక పరుగు చేసినా సూపర్ ఓవర్ కు వెళ్లేది. కానీ పావెల్ చివరి బంతికి అవుట్ కావడంతో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ సొంతమయింది.
Next Story