Mon Dec 23 2024 04:03:27 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఎవరికి ఈరోజు ఛాన్స్ ఉంది? క్రీడా నిపుణులు ఏమంటున్నారంటే?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో నేడు రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. రెండు మంచి ఫామ్ లో ఉన్నాయి
ఐపీఎల్ సీజన్ 17 మాత్రం ఎవరి అంచనాలకు అందడం లేదు. ఊహించని జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. ఛాంపియన్లు చాపచుట్టేశారు. ముంబయి ఇండియన్స్ ఇరగదీస్తుందని భావిస్తే అది ముందుగానే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఈసారి ఖచ్చితంగా ఛాంపియన్ అని అనుకున్నారంతా. కానీ ప్లేఆఫ్ కు కూడా చేరలేకపోయింది. ఈ సీజన్ లో మొదటి నుంచి కోల్కత్తా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మాత్రమే విజయాలు అందుకుంటూ ప్లే ఆఫ్ కు ఖచ్చితంగా చేరుకుంటాయని అందరూ వేసిన అంచనాలకు తగినట్లుగానే వారి ఆట సాగింది. మిగిలిన జట్లు మాత్రం అస్సలు ఎవరి అంచనాలకు అందలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అస్సలు ప్లే ఆఫ్ కు చేరుకోదని అందరూ నిర్ణయించుకున్న సమయంలో అనూహ్యంగా అది శివాలెత్తినట్లు వచ్చేసి ఇప్పుడు క్వాలిఫయిర్ ఆడుతుంది.
క్లిక్ అయితే చాలు...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో నేడు రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది. రెండు మంచి ఫామ్ లో ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ సీజన్ ప్రారంభంలో బాగా ఆడినా వరస ఓటములు దానిని వెంటాడుతున్నాయి. అయినా సరే అది పుంజుకునే ఛాన్స్ ను ఎవరూ కొట్టిపారేయలేరు. ఎందుకంటే మంచి హిట్టర్లున్న ఈ జట్టులో ఎవరు క్లిక్ అయినా మంచి స్కోరు సాధించినట్లే. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పరిస్థితి మరోలా ఉంది. సీజన్ ఆరంభంలో వరస ఓటములు చవి చూసి తర్వాత తేరుకుని ఇప్పుడు వరస విజయాలతో దూసుకు వచ్చింది. బెంగళూరు జట్టులోనూ మంచి హిట్టర్లున్నారు. క్లిక్ అయితే చాలు.. వీర బాదుడు తప్పదు. అందుకే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూపులు చూస్తున్నారు.
హిట్ అయ్యారంటే...?
రాజస్థాన్ రాయల్స్ జట్టులో యశస్వి జైశ్వాల్ క్లిక్ అయ్యాడంటే ఆపడం ఎవరి వల్లా కాదు. అలాగే సంజూ శాంసన్ మంచిఫామ్ లో ఉన్నాడు. ఇక రియాన్ పరాగ్ మంచి స్కోరు చేస్తూ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు విజయాలందించాడు. ఇలా వీరు చెలరేగి ఆడితే వీరిని ఆపడం ఎవరి తరమూ కాదు. ఇక బౌలింగ్ లోనూ సందీప్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, యజ్వేంద్ర చాహల్ వంటి వారు ఉండటంతో బౌలింగ్ పరంగా కూడా తీసిపారేయలేం. అందుకే ఈ జట్టును నిలువరించాలంటే ఆర్సీబీ చాలా శ్రమించక తప్పదు.
జట్టు బలంగానే...
ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ను తీసుకుంటే విరాట్ కోహ్లి ఫుల్లు ఫామ్ లో ఉన్నాడు. మినిమమ్ ఫిఫ్టీ గా ఈ సీజన్ లో ముందుకు వెళుతున్నాడు. ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక డూప్లెసిస్ క్లిక్ అయితే చాలు బౌండరీలు, సిక్సర్ల మోత తప్పదు. తర్వాత రజిత్ పాటీదార్ కూడా ఈ సీజన్ లో బ్రహ్మాడంగా ఆడి జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. దినేశ్ కార్తీక్, గ్రీన్, మ్యాక్స్వెల్ వంటి వారితో జట్టు పటిష్టంగా ఉంది. ఇప్పటి వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ లో మొత్తం ముప్పయి సార్లు తలపడితే ఆర్సీబీ పదిహేను మ్యాచ్ లలో గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ మాత్రం 12 మ్యాచ్ లలోనే గెలిచింది. దీంతో ఒకింత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వైపు మొగ్గు చూపుతున్నా ఇది ఐపీఎల్ కావడంతో ఎవరిది గెలుపు అన్నది మాత్రం చిట్ట చివరి వరకూ చెప్పడం కష్టమే.
Next Story