Fri Nov 22 2024 20:03:09 GMT+0000 (Coordinated Universal Time)
Rohit Sharma : రోహిత్ కు అన్యాయం జరిగిందా? లేక తనంతట తానే ఈ పరిస్థితిని తెచ్చుకున్నాడా?
రోహిత్ శర్మను ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా తొలగించడంపై ఆయన ఫ్యాన్స్ మండిపడుతున్నారు
ఇండియన్ కెప్టెన్ గా రోహిత్ శర్మ అరుదైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. రోహిత్ శర్మ సీనియారిటీ, సిన్సియారిటీని చూసిన బీసీసీఐ ఆయనకు వరల్డ్ టీ 20 కప్ పగ్గాలు కూడా అప్పగించింది. మైదానంలో ఆటగాళ్లు త్వరగా అవుటయినా.. ప్రత్యర్థి సిక్సర్, ఫోర్ కొట్టినా, క్యాచ్ మిస్ అయినా ఆటగాళ్లపై చిరాకు పడటం రోహిత్ బలహీనత కావచ్చు. కానీ కెప్టెన్ గా అందరినీ కలుపుకుని జట్టును నడిపించే నాయకత్వం ఉన్న టీం లీడర్ అని ఎవరైనా ఒప్పుకుంటారు. అందుకే రోహిత్ కెప్టెన్సీ లో అనేక విజయాలను చూశాం. వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్లో మిస్ అయినా రోహిత్ ను బీసీసీఐ కెప్టెన్సీ నుంచి మాత్రం తొలగించలేదు.
ఐదుసార్లు గెలిచి...
కానీ ఐపీఎల్ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. ముంబయి ఇండియన్స్ టీంకు రోహిత్ శర్మ పదేళ్ళకు పైగానే నాయకత్వ బాధ్యతలను వహించాడు. ఐదు సార్లు ముంబయి ఇండియన్స్ కు కప్ అందించాడు. జట్టు సమిష్టి విజయమే అయినా కెప్టెన్ గా రోహిత్ తీసుకున్న నిర్ణయాలు కూడా ముంబయి ఇండియన్స్ ఐదు సార్లు కప్ గెలుచుకోవడానికి కారణమని చెప్పక తప్పదు. రోహిత్ శర్మ ఓపెనర్ గా దిగి కుదురుకున్నాడంటే చాలు అవతలి వాళ్లకు చుక్కలు కనపడాల్సిందే. ప్రత్యర్థులకు చెమటలు పట్టాల్సిందే. అలవోకగా సిక్సర్లు, ఫోర్లు కొట్టడం రోహిత్ శర్మ సొంతం. అలాంటి రోహిత్ శర్మకు ఇప్పుడు అవమానం జరిగిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రోహిత్ ను కావాలని పక్కన పెట్టారంటూ కామెంట్స్ వినపడుతున్నాయి.
ఆల్ రౌండర్ అంటూ...
ఐపీఎల్ 2024 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న తరుణంలో ముంబయి ఇండియన్స్ జట్టుగా హార్ధిక్ పాండ్యాను ఆ జట్టు యాజమాన్యం రంగంలోకి దించింది. రోహిత్ తో పోల్చుకుంటే హార్ధిక్ ఆల్ రౌండర్ అని అనుకోవడం తప్ప.. అనుభవంలో చిన్నవాడే. రెండేళ్ల క్రితం వరకూ హార్ధిక్ పాండ్యా ముంబయి ఇండియన్స్ లో ఒక ఆటగాడిగానే ఉన్నాడు. తర్వాత ముంబయి ఇండియన్స్ ను వదిలి గుజరాత్ టైటాన్స్ కు వెళ్లారు. దానికి కప్ అందించాడు. అదే కొలమానంగా ముంబయి ఇండియన్స్ యాజమాన్యం తీసుకుందా? అన్న అనుమానం కూడా అభిమానుల్లో కలుగుతుంది. అంత అవసరమా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.
కెప్టెన్సీ అంటే...
రోహిత్ శర్మ ఐదుసార్లు కప్పును ముంబయి ఇండియన్స్ కు తీసుకొచ్చాడన్న కనీస కృతజ్ఞతను కూడా ఆ జట్టు యాజమాన్యం చూపించలేకపోయిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. జట్టు యాజమాన్యానికి, రోహిత్ శర్మకు మధ్య గ్యాప్ పెరగడం వల్లనే, కోచ్ సూచన మేరకు ఆయనను తప్పించారంటూ సోషల్ మీడియాలో రోహిత్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. 2020 తర్వాత కప్ రాలేదన్న కారణంతోనే రోహిత్ శర్మను మార్చారన్న వాదన కూడా ఉంది. కెప్టెన్ అంటే కేవలం ఆడటమే కాదు.. జట్టును సమర్ధవంతంగా నడపగలగాలి. మైదానంలో ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకోవాలి. మరి కొత్త కెప్టెన్ సారధ్యంలో ఈ సీజన్ లో ముంబయి ఇండియన్స్ కప్ ను సొంతం చేసుకుంటుందా? లేదా? అన్నది మాత్రం చూడాల్సి ఉంది. రోహిత్ శర్మ మాత్రం జట్టులో ఒక ఆటగాడిగానే ముంబయి ఇండియన్స్ జట్టులో మనకు కనిపించనున్నాడు.
Next Story