Sun Dec 22 2024 22:10:25 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : బంతి తిరిగింది.. బ్యాట్ తడబడింది.. సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది
చివరి క్వాలిఫయిర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మీద సూపర్ విక్టరీ కొట్టింది.
అవును.. ఎవరూ ఊహించని విజయమిది. ఓడిపోతుందని డిసైడ్ అయిన జట్టు బ్యాటర్లను కట్టడి చేస్తూ మ్యాచ్ ను తనవైపునకు తిప్పుకోవడం మామూలు విషయం కాదు. అందులో ఫైనల్స్ కు చేరాల్సిన జట్టు ఏది అన్నది నిన్న తొమ్మిదిన్నరకే ఒక అంచనాకు వచ్చినా.. దానిని తమకు అనుకూలంగా తిప్పుకోవడంలో సన్ రైజర్స్ హైదరాబాద్ సక్సెస్ అయింది. మామూలు సక్సెస్ కాదు.. సూపర్ విక్టరీని కొట్టింది. అభిమానులే కాదు... క్రీడా పండితులు సయితం ఆశ్చర్యపడేలా ఫైనల్స్ కు చేరింది. అందుకే అంటారు.. సముద్రాన్ని ఈది.. ఇంటి ముందు వీధి కాల్వలో పడినట్లయింది రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి. ఎవరూ ఊహించని విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్ కు చేరుకుంది.
తక్కువ పరుగులే అయినా...
నిన్న జరిగిన చివరి క్వాలిఫయిర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మీద సూపర్ విక్టరీ కొట్టింది. చూస్తే తక్కువ పరుగులు చేసింది. అయినా ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేయడంలో సక్సెస్ అయింది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆది నుంచి తడబడుతూ తన గమనాన్ని సాగించింది. అభిషేక్ శర్మ పన్నెండు పరుగులు చేసి అవుటయి ఉస్సూరుమనిపించాడు. త్రిపాఠి, హెడ్ నిలదొక్కుకుని ఆడుతున్నారులే అనుకోనేలోగా త్రిపాఠి 37 పరుగులకే అవుటయ్యాడు. హెడ్ 34 పరుగులకు అవుటయ్యాడు. మార్ క్రమ్ అలా వచ్చి ఒక పరుగు చేసి వెనుదిరిగాడు. క్లాసెన్ మాత్రం యాభై పరుగులు చేసి అవుట్ కావడంతో ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ పెద్దగా పరుగులు చేయకుండానే ముగిస్తుందని భావించారు. అందరూ అనుకున్నట్లు ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి కేవలం 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఐపీఎల్ లో ఇది పెద్ద స్కోరు ఏమీ కాదు.
ఫామ్ లో ఉన్న జట్టుకు...
అందులోనూ రాజస్థాన్ రాయల్స్ జట్టు మంచి ఫామ్ లో ఉంది. దానికి ఈ స్కోరు పెద్ద లెక్క కాదు. మంచి హిట్టర్లున్నారు. ఇక గెలుపు రాజస్థాన్ రాయల్స్్దేనని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ బంతి తిరిగింది. బ్యాట్ తడబడింది. 176 పరుగుల లక్ష్యసాధనలో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కు ఆరంభం బాగానే ఉంది. యశస్వి జైశ్వాల్ 42 పరుగులు చేశాడు. యశస్వి ఫోర్లు, సిక్సర్లు కొడుతుండటంతో ఇక గెలుపు సునాయాసమేనని అనుకున్నారంతా. అయితే 42 పరుగుల వద్ద యశస్వి అవుటయ్యాడు. క్యాడ్ మోర్ పది పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. శాంసన్ పది పరుగులకే వెనుదిరిగాడు. పరాగ్ ఆరు పరుగులకే క్యాచ్ ఇచ్చి వెళ్లిపోయాడు. జురెల్ నాటౌట్ గా నిలిచి 56 పరుగులు చేశాడు. అశ్విన్ డకౌట్ అయ్యాడు. హెట్ మయర్ నాలుగు, పావెల్ ఆరు పరుగులు చేసి వెనుదిరిగాడు. అప్పటికే పద్దెనిమిది బంతులకు యాభై పరుగులు చేయాల్సి ఉండగా విజయం సన్ రైజర్స్ హైదరాబాద్ వైపు చూసినట్లయింది. మిగిలిన బ్యాటర్లు ఆ టార్గెట్ ను రీచ్ కాలేకపోవడంతో ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. స్పినర్లు షాబాజ్ మూడు, అభిషేక్ శర్మ రెండు వికెట్లు తీసి జట్టును ఫైనల్స్ కు చేర్చారు.
Next Story