Fri Nov 22 2024 18:14:15 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : ఏదో చేద్దామనుకుంటే.. మరేదో అయింది.. ప్లాన్ రివర్స్ కావడంతో ఫ్లాప్ అయిన సన్ రైజర్స్.. ఫైనల్స్ కు కేకేఆర్
సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కత్తా నైట్ రైడర్స్ చేతిలో దారుణంగా ఓటమిపాలయింది
ఈ ఐపీఎల్ సీజన్ లో మొదట బ్యాటింగ్ చేసి అనేక రికార్డులను అధిగమించి సన్ రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించింది. తొలుత బ్యాటింగ్ చేస్తే దానిని ఆపడం ఎవరి తరమూ కాదన్న అభిప్రాయం అందరిలోనూ నెలకొంది. ఒక మ్యాచ్ లో కాదు... వరసగా తన రికార్డులను తానే బద్దలు కొడుతూ అత్యధిక స్కోర్లు నమోదు చేయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఫస్ట్ బ్యాటింగ్ అచ్చి వచ్చిందనుకున్నారు. అలాగే ప్రత్యర్థి జట్లు కూడా టాస్ గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ కు తొలుత బ్యాటింగ్ ఇవ్వడానికే భయపడ్డారంటే అతిశయోక్తి ఏమీ లేదు. అందుకే నసన్ రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్ లో గెలిచి నేరుగా ఫైనల్స్ కు చేరాలనుకుంది. అందుకు టాస్ పడటంతో తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అదే ఆ జట్టు పాలిట శాపంగా మారింది. వరసగా వికెట్లు కోల్పోతూ తక్కువ స్కోరుకు అవుట్ కావాల్సి వచ్చింది.
ఆసక్తి లేకుండానే...
నిన్న అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ చూసిన వారికి ఎవరికైనా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని తప్పు చేశారా? అన్న భావన సన్ రైజర్స్ హైదరాబాద్ విషయంలో కలుగుతుంది. నిన్న జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కత్తా నైట్ రైడర్స్ చేతిలో దారుణంగా ఓటమిపాలయింది. 6.2 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని కేకేఆర్ ఛేదించగలిగింది. దీంతో మరో మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడాల్సి ఉంది. అది గెలిస్తే ఫైనల్స్ కు చేరుకునే అవకాశాలున్నాయి. కనీసం ఆసక్తి లేకండా క్వాలిఫయిర్ మ్యాచ్ జరిగిందంటే.. దానికి కారణం సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లే కారణం. ఎవరూ నిలబడలేదు. ఇప్పటి వరకూ మైదానంలో వీర విహారం చేసిన వారు కేకేఆర్ బౌలర్ల దెబ్బకు పెవిలియన్ బాట పట్టారు. అసలు ఒక దశలో వంద స్కోరు అయినా చేస్తుందా? అన్న అనుమానం కూడా కలిగిందంటే ఆశ్చర్యం కలగక మానదు.
వరస బెట్టి అవుట్ అయి...
తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్ గా వచ్చి హెడ్ డకౌట్ అయ్యాడు. అభిషేక్ శర్మ మూడు పరుగులకే వెనుదిరిగాడు. త్రిపాఠి ఒక్కడే పోరాటంచేసి 55 పరుగులు చేభాడు, నితీష్ కుమార్ రెడ్డి 9 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. షాబాజ్ డకౌట్ అయ్యాడు. క్లాసెన్ కాసేపు అలరించినా 32 పరుగులు వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. స్టార్క్ దెబ్బకు సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు విలవిలలాడిపోయారు. 19.3 ఓవర్లలోనే ఆలౌల్ అయి 159 పరుగులు మాత్రమే చేశారు.
ముందే విజయం ఖాయం...
ఇక పెద్ద స్కోరు కాకపోవడంతో కోల్కత్తా నైట్ రైడర్స్ విజయం ముందే ఖాయమయింది. టీవీలన్నీ కట్టేశారు. గుర్బాజ్ 23 పరుగులు చేసి అవుటయ్యాడు. నరైన్ 21 పరుగుల వద్ద వెనుదిరిగాడు. వెంకటేశ్ అయ్యర్ 51 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 55 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి పనిని పూర్తి చేశారు. దీంతో కోల్కత్తా నైట్ రైడర్స్ ఫైనల్స్ కు చేరుకుంది. కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణ ఓటమిని చూడాల్సి వచ్చింది. మరో మ్యాచ్ మిగిలి ఉండటంతో ఇంకా ఆశలు మాత్రం ఉన్నాయి.
Next Story