Fri Dec 20 2024 08:31:49 GMT+0000 (Coordinated Universal Time)
IPL 2024 : విరాట్ శతకం వృధా.. ఇక బెంగళూరు చాప చుట్టేయాల్సిందేనా?
జైపూర్ లో జరిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో కొహ్లి సెంచరీ వృధా అయింది
బెంగళూరు జట్టుకు ఈ ఐపీఎల్ సీజన్ అస్సలు కలసి రావడం లేదు. ఐదు మ్యాచ్ లలో ఒకే ఒక మ్యాచ్ గెలిచిన రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఆశలు సన్నగిల్లాయి. కప్పు కొట్టడం మాట అలా ఉంచితే.. ప్లే ఆఫ్ కు వస్తుందా? అన్న అనుమానాలు కూడా బయలుదేరాయి. ఇందుకు కారణం వరస ఓటములే కారణం. ఎన్ని పరుగులు చేసినా అస్సలు కలసి రావడం లేదు. రికార్డులు మాత్రం నమోదువుతున్నాయి కానీ... పాయింట్లు మాత్రం ఆ జట్టు ఖాతాలో చేరడం లేదు. తాజాగా జైపూర్ లో జరిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కూడా మరోసారి ఇదే నిరూపించింది.
కొహ్లి సెంచరీ చెసినా...
తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. విరాట్ కోహ్లి సెంచరీ నమోదు చేసి తన ఖాతాలో మరొక రికార్డు చేర్చుకున్నాడు. తొలి నుంచి బాగానే ఆడిన జట్టు సభ్యులు డెత్ ఓవర్లకు వచ్చే సరికి నీరుగారి పోతున్నారు. కోహ్లి 113 పరుగులు చేశాడు. డుప్లెసిస్ 44 పరుగులు చేశాడు. వాళ్లిద్దరే కొద్దోగొప్పో ఆడారు. అంతే ఆ తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్, సౌరభ్ చౌహాన్ వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు. గ్రీన్ కూడా అంతంత మాత్రంగానే ఆడాడు. దీంతో ఇరవై ఓశర్లకు మూడు వికెట్లు కోల్పోయి 183 పరుగులు మాత్రమే చేసింది. ఇది ఈ జట్టుకు పెద్ద స్కోరు కాదు అని ఎవరైనా చెప్పగలరు.
బట్లర్ బాదుడుతో...
తర్వాత ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ ఇక తిరిగి చూడలేదు. సొంత మైదానం కావడంతో పాటు బట్లర్ చెలరేగి కోహ్లికి ధీటుగా సెంచరీ నమోదు చేయడంతో ఆ జట్టుదే విజయం అయింది. ఛేదనలో బ్యాటింగ్ కు దిగిన వెంటనే యశస్వి జైశ్వాల్ వికెట్ పడటంతో కొంత ఆశలు చిగురించాయి. అయితే బట్లర్ పాతుకుపోయాడు. వంద పరుగులు చేశాడు. శాంసన్ కూడా మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడేశాడు. సంజూ శాంసన్ 69 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. హెట్ మేయర్ మ్యాచ్ ను ముగించాడు. బెంగళూరు జట్టు బౌలర్ల ఘోర వైఫల్యం కారణంతోనే ఇంతటి ఘోర పరాజయం దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓటమి పాలు కావడంతో ఆ జట్టు ఫ్యాన్స్ డీలా పడ్డారు.
Next Story