Sun Dec 22 2024 19:07:38 GMT+0000 (Coordinated Universal Time)
Dk Aruna : డీకే అరుణ ఫేట్ ఎలా ఉంది..? పార్లమెంటులో కాలుమోపే అవకాశాలున్నాయా?
అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న డీకే అరుణ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు
తెలంగాణలో ఫైర్ బ్రాండ్ డీకే అరుణ ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్న డీకే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజవర్గం నుంచి ఆమె పోటీకి సిద్ధమయ్యారు. బీజేపీ నుంచి ఆమె అభ్యర్థిగా బరిలోకి నిలుస్తున్నారు. ఆమె కాంగ్రెస్ నుంచి వంశీచందర్ రెడ్డిని ఎదుర్కొన బోతున్నారు. తాను గెలిస్తే ఖచ్చితంగా కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందని ఆమె అసెంబ్లీ ఎన్నికలకు కూడా దూరంగా ఉన్నారు. ఖచ్చితంగా కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే తెలంగాణ నుంచి మహిళ కోటా కింద ఈసారి తనకు కేంద్ర మంత్రి పదవి లభిస్తుందని గట్టిగా ఆశిస్తున్నారు.
అసెంబ్లీ సెగ్మెంట్లలో...
అందుకే డీకే అరుణ పార్లమెంటు ఎన్నికలకు కూడా సిద్ధమయ్యారు. ఆమెకు టిక్కెట్ ఇవ్వడంతో అప్పటి వరకూ పార్టీలో కీలకనేతగా ఉన్న జితేందర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. దీంతో డీకే అరుణ ఒంటరి పోరాటం చేస్తున్నట్లే లెక్క. మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో కొడంగల్, నారాయణపేట, మహబూబ్ నగర్, జడ్చర్ల దేవరకద్ర, మక్తల్, షాద్ నగర్ శాసనసభ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ ఈ నియోజకవర్గాల్లో గెలిచింది. దీంతో పాటు మహబూబ్ నగర్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా...
రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో కాంగ్రెస్ జెండా ఎగిరేందుకు అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గం ట్రాక్ రికార్డు చూసినా ఒక్కడ ఒక్కసారి మాత్రమే బీజేపీ విజయం సాధించింది. 1999లో బీజేపీ జెండా ఇక్కడ గెలిచింది. జితేందర్ రెడ్డి అక్కడి నుంచి విజయం సాధించారు. అంతే ఆ తర్వాత ఇప్పటి వరకూ అక్కడ కాషాయ జెండా ఎగరలేదు. మరోవైపు రెడ్డి సామాజికవర్గం నేతలే ఎక్కువగా ఇక్కడి నుంచి గెలుస్తుంది. బీఆర్ఎస్ కూడా ఇక్కడ బలంగానే ఉంది. తీసి పారేసే పరిస్థితుల్లో మాత్రం ఆ పార్టీ లేదన్నది వాస్తవం. దీంతో డీకే అరుణ రెండు పార్టీల అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొననున్నారు.
అంత ఆషామాషీ కాదు...
డీకే అరుణ కుటుంబానికి రాజకీయంగా మంచి ట్రాక్ రికార్డు ఉన్నప్పటికీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ఆమె ఎంత వరకూ విజయం సాధిస్తారన్నది మాత్రం ఆసక్తికరంగా సాగింది. ప్రధాని మోదీ చరిష్మా ఇక్కడ పనిచేస్తుందని ఆమె భావిస్తున్నారు. అయోధ్యలో ఆలయ నిర్మాణంతో పాటు తాను గెలిస్తే కేంద్ర మంత్రి అవుతానని చెప్పుకుంటూ ఆమె ప్రచారాన్ని చేస్తుండటం కొంత కలసి వచ్చే అవకాశముందని చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులను ఎదుర్కొనడం కూడా అంత ఆషామాషీ కాదు. అందుకే ఆమె ఎర్రటి ఎండలోనూ తన ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పదవులకు దశాబ్దకాలంగా దూరంగా ఉన్న డీకే అరుణకు ఇప్పటికైనా ఆ యోగం పట్టనుందా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story