Mon Dec 23 2024 02:42:54 GMT+0000 (Coordinated Universal Time)
KCR : సారుకు అర్థమయినట్లుంది.. నేల మీద నడిచేటట్లే ఉన్నట్లుందిగా
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తెలంగాణ ప్రజల ఇచ్చిన దెబ్బకి దిగివచ్చినట్లే కనపడుతుంది. ఆయన నేల మీదకు నడుస్తున్నట్లే కనపడుతుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజల ఇచ్చిన దెబ్బకి దిగివచ్చినట్లే కనపడుతుంది. ఆయన నేల మీదకు నడుస్తున్నట్లే కనపడుతుంది. మూడోసారి ముఖ్యమంత్రి అవ్వాలనుకున్న ఆయనకు గత ఎన్నికల్లో ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. పోనీ .. ఐదేళ్లు వెయిట్ చేద్దాంలే అనుకుంటే ఒకవైపు ఢిల్లీలోని మోదీ తన కుటుంబ సభ్యులు గుంజుకుని జైల్లో పెడుతున్నారు. ఇక్కడేమో రేవంత్ రెడ్డి రోజూ రగడ చేస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్ అంటూ రోజుకొకరిని లోపలకి తోసేస్తున్నాడు. మరోవైపు పార్టీలో పదవులు పొందిన నేతలు కూడా కేసీఆర్ ను అనరాని మాటలు అంటూ గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోతున్నారు.
ఎన్నికలు వస్తుండటంతో...
మరో వైపు పార్లమెంటు ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సరైన ఫలితాలు సాధించక పోతే మళ్లీ పదేళ్లు ఫాం హౌస్ కే పరిమితం కావాల్సి వస్తుంది. అప్పటి వరకూ పార్టీలో ఎంత మంది ఉంటారో? ఊడతారో తెలియదు. అందుకే సారు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రేపటి నుంచి బస్సు యాత్ర మొదలుపెట్టారు. మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన బస్సు యాత్రలో రాత్రికి నియోజకవర్గాల్లోనే బస చేస్తారు. అంతే కాదు పొలంబాట కూడా పట్టనున్నారు. ఇలా జనం ఎదుటకు కేసీఆర్ వెళ్లేందుకు బస్సు ను సిద్ధం చేసుకున్నారు. అంటే గతం కంటే కొంతలో కొంత జనంలోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమయినట్లే కనపడుతుంది.
ఉంటే ఆ రెండు చోట్ల...
ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఉంటే ప్రగతి భవన్.. లేకుంటే ఫాం హౌస్.. ఈ రెండు లేకుండా ఆయన ఎక్కడా ఉండేవారు కాదు. ఎన్నికలప్పుడు హెలికాప్టర్ లో వచ్చి అల్లంత దూరాన తిరుగుతూ చేతులూపి వెళుతుండేవారు. తన మాటల మాయతో జనం మరోసారి గెలిపిస్తారనుకుంటే ఈసారి సాధ్యం కాకపోవడంతో ఆయనకు అసలు విషయం బోధపడినట్లుంది. అందుకే ఆయన జనం వెంట నడిచేందుకు సిద్ధమయ్యారు. జనం సమస్యలపై పోరాటం చేస్తామని చెబుతున్నారు. ఇక పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉండటంతో నేతలు జారిపోకుండా ఉండేందుకు ఇటు నేతల్లోనూ, అటు క్యాడర్ లోనూ నమ్మకం కలిగించేలా గులాబీ బాస్ ప్రయత్నాలు మొదలు పెట్టారు.
సీఎం అయిన తర్వాత...
ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన టీవీ డిబేట్ లకు వచ్చింది లేదు. ప్రగతి భవన్ లో మీడియా సమవేశానికే ఆయన పరిమితం అయ్యేవారు. అదీ ఏదైనా అత్యవసరం అయితే తప్ప మీడియాకు కూడా ఎంట్రీ లేదు. సెక్రటేరియట్ కు కూడా చుట్టపుచూపుగా వచ్చి పోయే కేసీఆర్ ఈరోజు ఒక టీవీ డిబేట్ కు వస్తుండటం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. కేవలం వందరోజుల్లోనే కేసీఆర్ లో ఇంత మార్పా? అని జనం ఆశ్చర్యపోతున్నారు. మీడియా సమావేశాల్లో తాను చెప్పేసి వెళ్లిపోయే వైఖరి ఉన్న కేసీఆర్ ఒక టీవీ లైవ్ డిబేట్ కు వచ్చి యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి రావడం అంటే.. కేసీఆర్ పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్థం చేసుకోన్నోళ్లకు అర్థమయినంత అని చెప్పాలి. కేసీఆర్ కు ఇప్పుడు బలం.. బలహీనత.. జనం.. వారి మూడ్ అనేది పక్కాగా తెలిసిపోయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Next Story