Mon Nov 18 2024 11:36:30 GMT+0000 (Coordinated Universal Time)
Congress Manifesto: ‘పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీస్’.. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫేస్టో
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మ్యానిఫేస్టోను విడుదల చేసింది
లోక్సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మ్యానిఫేస్టోను విడుదల చేసింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు మ్యానిఫేస్టోను విడుదల చేశారు. పాంచ్ న్యాయ్.. పచ్చీస్ గ్యారంటీ పేరుతో ఈ మ్యానిఫేస్టోను విడుదల చేశారు. సామాజిక న్యాయంతో పాటు రైతులు, కార్మికులకు, యువతకు, మహిళలకు న్యాయం పేరిట ఈ గ్యారంటీలను అమలు చేయనున్నట్లు మ్యానిఫేస్టోలో ప్రకటించింది. గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వస్తుంది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని దేశ ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చింది.
అందరికీ భరోసా...
దేశంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. తాము అధికారంలోకి రాగానే పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గిస్తామని తెలిపింది. నిత్యవాసరాల ధరలను తగ్గించడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని కూడా కాంగ్రెస్ అగ్రనేతలు ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రధానంగా పేదల ఆదాయానికి భరోసా కల్పించేలా నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు మాత్రమే కాకుండా, వారికి అన్ని రకాలుగా ఆదుకునేలా ప్రణాళిక ఉంటుందని పేర్కొంది. యువత కు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.
అన్ని వర్గాల వారినీ...
ఉపాధి కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు. మహిళలకు పారిశ్రామికంగా, రాజకీయంగా, విద్యా రంగాల్లో మెరుగైన ఉపాధిని కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. మహిళల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలను తీసుకు వచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేలా పథకాలను రూపొందిస్తామని తెలిపారు. కర్ణాటక, తెలంగాణలో తరహాలోనే జాతీయ స్థాయిలో గ్యారంటీలను తీసుకు వచ్చేలా ఈ మ్యానిఫేస్టోను రూపకల్పన చేసినట్లు కనపడుతుంది. అధికారంలోకి రాగానే కులగణన చేస్తామని కూడా హామీ ఇచ్చింది.
Next Story