Mon Nov 18 2024 09:39:08 GMT+0000 (Coordinated Universal Time)
Congress : కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందా... ఓవర్ ఆల్ గా అంతేనా? దీనికి బాధ్యులు ఎవరు?
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదన్న వార్తలు పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏ మాత్రం బాగాలేదన్న వార్తలు పార్టీ నేతలను కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా కరువు, కరెంట్ వంటి సమస్యలు దాని మెడకు చుట్టుకునేలా ఉన్నాయన్న నివేదికలతో కాంగ్రెస్ అగ్రనాయకత్వం కొంత ఇబ్బంది పడుతుంది. లోక్ సభ ఎన్నికలను పీసీసీ చీఫ్ గా, తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందంటే అది తన నాయకత్వం వల్లనే అన్న ధీమాతో ఉన్న ఆయనలో కొంత బెరుకుదనం కనిపిస్తున్నట్లే ఉంది. ఎందుకంటే పదే పదే దేవుళ్ల మీద ప్రమాణం చేస్తూ తమను నమ్మాలంటూ ప్రజలను వేడుకునే తీరు చూసిన వారికి ఎవరికైనా అదే అనిపించక మానదు.
కరెంట్ కష్టాలు...
బ్యాడ్ లక్ ఏంటంటే.. కాంగ్రెస్ కావాలని తెచ్చుకున్న కష్టాలు కావివి. ఈ ఏడాది ఎప్పుడూ లేనంత కరువు రాష్ట్రంలో నెలకొంది. పంటలు ఎండిపోయాయి. భూగర్భ జలాలు ఎండిపోయాయి. పంటలకు నీళ్లు అందక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక విద్యుత్తు సమస్య కూడా రేవంత్ సర్కార్ ను వెంటాడుతుంది. పైకి కరెంట్ కోతలు లేవని చెబుతున్నా గతంలో కంటే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం, ఉక్కపోత కూడా అధికంగా ఉండటంతో విద్యుత్తు వాడకం కూడా ఎక్కువ అయింది. ఏప్రిల్ నెలలో రోజుకు నాలుగున్నర వేల మెగావాట్ల విద్యుత్తు వినియోగం అవుతుంది. గత ఏడాది చూసుకుంటే మూడున్నర వేల మెగావాట్లు మాత్రమే వాడకం అయ్యేది. అందువల్లనే కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పార్టీనేతలు చెబుతున్నా అవేమీ పట్టించుకునే పరిస్థితి జనంలో లేదు.
కాటేసిన కరువు...
ప్రధానంగా రైతులు కొంత అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు కూడా కాంగ్రెస్ ను కలవరం పెడుతున్నాయి. కరువుతో పంటలు చేతికి అందడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు నష్టపోతున్నారు. గతపదేళ్లలో ఎన్నడూ లేని పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. అయితే పండిన పంటకు కూడా గిట్టుబాటు ధర లభించడం లేదన్న ఆవేదనలో రైతులున్నారు. మరోవైపు రైతు బంధు పథకంలోనూ కొందరికి కోతలు పెట్టడం కూడా రైతుల్లో అసంతృప్తికి కారణంగా తెలుస్తోంది. ఐదు ఎకరాలున్న వారికే రైతు బంధు ఇవ్వాలని రేవంత్ సర్కార్ ప్రాధమికంగా నిర్ణయించినట్లు వచ్చిన వార్తలతో పాటు అందరికీ రైతు బంధు పథకం అందకపోవడం కూడా కాంగ్రెస్ పాలన పట్ల కొంత అసంతృప్తి ఏర్పడిందన్నది కాదనలేని వాస్తవం. ఈ రెండు కారణాలు కాంగ్రెస్ కావాలని నెత్తిమీదకు తెచ్చుకున్నవి కావు.. ప్రకృతి ప్రకోపం వల్లనే కాంగ్రెస్ కు శాపంగా మారిందని చెప్పాలి.
కేసీఆర్ యాత్ర కూడా...
అందుకే రేవంత్ రెడ్డి పదే పదే రైతులను ఆకట్టుకునేందుకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఆగస్టు 15వ తేదీలోపు చేస్తానని కనిపించిన దేవుళ్ల అందరి మీద ఒట్టేసి చెబుతున్నారు. మరో వైపు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వైపు సానుభూతి కూడా కొంత ఉందంటున్నారు. ఎటూ రాష్ట్రంలో కాంగ్రెస్ ను గెలిపించాం కాబట్టి.. ఈసారి కేసీఆర్ కు ఓటేస్తే వచ్చే నష్టమేంటన్న ధోరణిలో కొన్ని వర్గాలున్నట్లు నివేదికలు అందుతున్నాయి. అదే ఇప్పుడు కాంగ్రెస్ లో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డి పదే పదే పార్లమెంటు నియోజకవర్గాలకు బాధ్యులైన వారితో పదే పదే మాట్లాడుతూ వారిని అలెర్ట్ చేస్తున్నారు. కేసీఆర్ బస్సు యాత్రకు కూడా మంచి స్పందన వస్తుండటం కూడా కాంగ్రెస్ గ్రాఫ్ కొంత తగ్గిందని చెప్పడానికి నిదర్శనమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద రేవంత్ తో పాటు మంత్రులందరికీ ఈ ఎన్నికలు ఒక సవాల్ అని చెప్పక తప్పదు.
Next Story