Sat Dec 21 2024 08:17:17 GMT+0000 (Coordinated Universal Time)
BRS : కేసీఆర్ ఈయనను వదలరా? పార్టీకి ఇంత నష్టం జరుగుతున్నా ఎందుకంత ఇష్టం?
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడానికి అనేక కారణాలున్నాయి. అందులో జగదీష్ రెడ్డి ఒకరు అన్న టాక్ నడుస్తోంది
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడానికి అనేక కారణాలున్నాయి. కేసీఆర్ వ్యవహార శైలి కొంత కారణమైతే జిల్లాకొక నేత కేసీఆర్ లా మారడం కూడా పార్టీ ఓటమికి కారణమన్న అభిప్రాయం కలుగుతుంది. ఒక్క జిల్లాలోనే కాదు.. తుడుచు పెట్టుకుపోయిన జిల్లాలను పరిశీలించినప్పుడు ఇదే అర్థమవుతుంది. ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ కారణంగానే అక్కడ భద్రాచలం స్థానం మినహా మిగిలిన స్థానాలను అన్నింటీని గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కోల్పోవాల్సి వచ్చింది. సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి ఆర్థిక, సామాజికపరంగా బలమైన నేతలు పార్టీకి దూరమయ్యారన్నది ఇప్పటికీ పార్టీలో వినిపిస్తున్న టాక్.
ఒకే ఒక స్థానంతో...
అలాగే నల్లగొండ జిల్లాలోనూ జూనియర్ కేసీఆర్ ఉన్నారంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఆయనే గుంటకండ్ల జగదీష్ రెడ్డి. నల్లగొండ జిల్లాలో ఆయన తప్పించి మిగిలిన అన్ని స్థానాల్లో కాంగ్రెస్ గెలవడానికి జగదీష్ రెడ్డి వ్యవహారశైలి కారణమన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఖమ్మం జిల్లా అయితే కొంత సామాజికవర్గం పరంగానూ, మరొకపక్క టీడీపీ అభిమానులు ఎక్కువగా ఉండటం అక్కడ దెబ్బతినిందని భావించినా ఖమ్మం, నల్లగొండ జిల్లాలు రెండు ఏపీ బోర్డర్ లో ఉన్నప్పటికీ నల్లగొండ జిల్లా తొలి నుంచి బీఆర్ఎస్ కు అక్కడి ప్రజలు అత్యధిక స్థానాలను ఇస్తూ వస్తున్నారు. గతంలో కమ్యునిస్టులు.. ఆ తర్వాత కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న నల్లగొండ జిల్లా తర్వాత గులాబీమయం అయింది.
భారీ నష్టం జరిగినా...
అయితే జగదీష్ రెడ్డి కారణంగానే అక్కడ పార్టీకి భారీ నష్టం జరిగిందన్న కామెంట్స్ అయితే బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేతలు కూడా వీడి పోవడం వెనక ఆయన కూడా ఒక కారణమని అంటున్నారు. జగదీష్ రెడ్డి కేవలం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేట నియోజకవర్గానికే పరిమితం కాలేదు.2009 ఎన్నికల్లో జగదీష్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో ఆయన సూర్యాపేటకు మారారు. అక్కడి నుంచి కూడా గెలిచారు. ఆయన మంత్రిగా ఉండటంతో కేసీఆర్ కేబినెట్ లో మరొకరికి ఆ జిల్లా నుంచి అవకాశం కూడా రాలేదు. తొమ్మిదేళ్ల పాటు కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న జగదీష్ రెడ్డి అంతా తానే అయి .. తనవల్లనే పార్టీ గెలుస్తుందన్న భ్రమల్లో ఉంటారంటారు. కార్యకర్తలను అస్సలు పట్టించుకోరట. ఒక స్థాయి నేతల వైపు కూడా ఆయన చూడరన్న విమర్శలున్నాయి.
వేలు పెడుతూ...
ప్రతి నియోజకవర్గంలో వేలు పెడుతూ అక్కడ తనకంటూ ప్రత్యేక వర్గాన్ని జగదీష్ రెడ్డి తయారు చేసుకున్నాడన్న విమర్శలున్నాయి. ఆయన ఎంత చెబితే కేసీఆర్ కు అంత. తాజాగా మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఆయననుద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. కొందరు మాటలను మాత్రమే కేసీఆర్ నమ్ముతున్నారన్నారు. మా పార్టీలోనూ లిల్లీ పుట్ లు ఉన్నారని ఆయన వ్యాఖ్యానించడంతో కలకలం రేగింది. గుత్తా పార్టీ నుంచి వెళ్లిపోవడానికే నిర్ణయించుకుని ఈ కామెంట్స్ చేశారంటున్నారు. కానీ కేసీఆర్ మాత్రం జగదీష్ రెడ్డిని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. తెలంగాణ ఉద్యమం నుంచి తనతో నడిచిన ఆయనకు ప్రయారిటీ తగ్గించడం లేదట. తాజాగా లోక్సభ ఎన్నికల ప్రచారం కూడా అదే జిల్లా నుంచి ప్రారంభిస్తుండటం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.
Next Story