Fri Nov 22 2024 09:49:09 GMT+0000 (Coordinated Universal Time)
BJP : తెలంగాణ నేతలకు కత్తి మీద సామే.. ఈసారి టార్గెట్ రీచ్ కాకపోతే మాత్రం?
తెలంగాణ బీజేపీ నేతలకు ఈ ఎన్నికలు కఠిన పరీక్ష. తెలంగాణ పై పార్టీ అధినాయకత్వం ఎన్నో హోప్ప్ పెట్టుకుంది.
తెలంగాణ బీజేపీ నేతలకు ఈ ఎన్నికలు కఠిన పరీక్ష. తెలంగాణ పై పార్టీ అధినాయకత్వం ఎన్నో హోప్ప్ పెట్టుకుంది. గత ఎన్నికల్లోనే నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. గత అసెంబ్లీలో కేవలం ఒక నియోజకవర్గం నుంచే కమలం పార్టీ గెలిచింది. కానీ ఈసారి అలా కాదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో మూడో అతి పెద్ద పార్టీగా అవతరించింది. కొంచెం కష్టపడితే ఇక్కడ గెలవడం సులువని భావించిన అగ్రనేతలు ఎక్కువ సార్లు పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి అమిత్ షా, కేంద్రమంత్రులందరూ తెలంగాణలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. ఇక ఫలితాల కోసం మరో ఇరవై రోజులు వెయిట్ చేయాలి.
అత్యధిక స్థానాల్లో...
తెలంగాణలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత అత్యధిక స్థానాలు గెలుచుకునేది తెలంగాణలో మాత్రమేనని నమ్మకం. అందుకే ఇక్కడ నేతలకు గత కొన్నేళ్లుగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డిని నియమించారు. రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్ ను ఎంపిక చేశారు. అంతేకాదు ఇంద్రసేనారెడ్డి, దత్తాత్రేయలకు గవర్నర్ గిరీ లభించింది. ఇన్ని పదవులు ఇచ్చింది పార్టీని మరింత బలోపేతం చేయడం కోసమేనన్నది అందరికీ తెలిసిందే. అందుకే ఈసారి ఎక్స్పెక్టేషన్స్ తెలంగాణపై ఎక్కువగా ఉన్నాయి. కనీసం ఎనిమిది నుంచి పది స్థానాల్లో గెలవాలన్న లక్ష్యాన్ని నేతలకు నిర్దేశించారు.
కొత్త వారికి...
తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తే రానున్న కాలంలో తెలంగాణ నుంచి మరింత మందికి పదవులు దక్కే అవకాశముందని ఇప్పటికే సంకేతాలు పంపిన కేంద్ర నాయకత్వం పార్టీ నాయకులకు ఎప్పటికప్పుడు స్వీట్ వార్నింగ్ లు ఇస్తూనే ఉంది. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పాటు మరికొన్ని స్థానాలు కమలం ఖాతాలో పడాలని ఈసారి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఎక్కువగా టిక్కెట్లు కూడా కేటాయించారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆర్థికంగా, సామాజికంగా మాత్రమే కాకుండా ఓటు బ్యాంకును పెంచుకునే విధంగా హైదరాబాద్ వంటి నియోజకవర్గంలోనూ ఈసారి విలక్షణమైన వారిని ఎంపిక చేసింది.
ఏపీలో కూటమితో ఉన్నా....
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లో కూటమిలో కలసినా అక్కడ ఆరు పార్లమెంటు నియోజకవర్గాల్లోనే పోటీకి దిగింది. అక్కడ కంటే తెలంగాణలో ఎక్కువ స్థానాలు గెలవాలన్నది పార్టీ అగ్రనేతల లక్ష్యం. ఎందుకంటే అక్కడ కూటమితో ఉండటంతో గెలిచినా పార్టీ బలోపేతం సాధ్యం కాదు. అందుకే తెలంగాణలో టీడీపీతో కానీ, జనసేనతో కానీ పోటీ చేయకుండా ఒంటరిగానే పోటీకి దిగింది. అదే ఇప్పుడు తెలంగాణ నేతలకు అసలు సమస్యగా మారింది. ఎక్కువ స్థానాలు గెలుచుకోకపోతే మాత్రం ఇక్కడి నేతలను ఖచ్చితంగా పార్టీ నాయకత్వం పక్కన పెడుతుందన్న ప్రచారం జరుగుతుండటంతో అందరిలోనూ అదే టెన్షన్ నెలకొంది. మరి చివరకు తెలంగాణ నేతలు ఏ మేరకు సక్సెస్ అవుతారన్నది చూడాల్సి ఉంది. మరో ఇరవై రోజులు మాత్రమే రిలీఫ్. ఫలితాలు వచ్చిన తర్వాత కానీ అసలు విషయం తెలియదు.
Next Story