Sun Dec 22 2024 23:10:26 GMT+0000 (Coordinated Universal Time)
KCR : కేసీఆర్ కు పార్లమెంటు ఎన్నికలే కీలకం...ఇందులో గెలవకుంటే మాత్రం?
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రానున్న పార్లమెంటు ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు రానున్న పార్లమెంటు ఎన్నికలు కీలకంగా మారబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కనీసం డబుల్ డిజిట్ లో గులాబీ పార్టీ అభ్యర్థులు గెలవకపోతే మాత్రం పార్టీ దాదాపు ఖాళీ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అలా ఉంది తెలంగాణలో సీన్. రాజకీయ నేతల్లోనూ కేసీఆర్ పట్ల జనంలో విశ్వాసం ఉందా? లేదా? అనడానికి ఈ ఎన్నికలు కొలమానికంగా నేతలు తీసుకోనున్నారు. ఇప్పటికే మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కొద్ది శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలయితేనే వరస బెట్టి నేతలు పార్టీని వీడి వెళ్లిపోతున్నారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఒకటో అరో సీట్లు తెచ్చుకుంటే ఉన్న వాళ్లు కూడా ఆలోచనలో పడే అవకాశముంది.
పర్యటలను షురూ...
అందుకే గులాబీ బాస్ నేరుగా రంగంలోకి దిగారు. పార్లమెంటు నియోజవర్గాల వారీగా పర్యటనలు మొదలుపెట్టేశారు. ప్రజలను తన వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రైతు భరోసాతో పాటు రైతు రుణమాఫీలపై పదే పదే ప్రశ్నలు సంధిస్తున్నారు. దళితబంధు ఎక్కడపోయిందని నిలదీస్తున్నారు. ఉద్యోగాల ఊసే లేదే అని జనంలోకి వెళుతున్నారు. ఇలా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా కేసీఆర్ పర్యటనలు సాగుతున్నాయి. తన బిడ్డ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లడం కొంత పార్టీకి ఇబ్బంది కలిగించే వ్యవహారం కావడంతో బీజేపీ పై పెద్దగా విమర్శలు చేయడం లేదు కానీ, కాంగ్రెస్ ను మాత్రం ఏకిపారేస్తున్నారు.
గ్యారంటీలపై నిలదీస్తూ...
కాంగెస్ అధికారంలోకి రావడానికి ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఇంకెప్పుడరా భాయ్? అంటూ నిలదీస్తున్నారు. ఇక రైతుల కోసం నేరుగా పొలంబాట పట్టారు. తాను కనక ముఖ్యమంత్రిగా ఉంటే రైతులు ఇలా ఇబ్బంది పడి ఉండేరా? అన్న తరహాలో ఆయన రోడ్డెక్కి మరీ నినదిస్తున్నారు. నీళ్లు ఎందుకు వదలరంటూ సర్కార్ ను నిలదీస్తున్నారు. తాను రైతుబంధును ఠంఛన్ గా వేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బంధులో కోత పెట్టిందని చెబుతూ ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు రైతులతో పాటు మహిళలు, యువతను ఆకట్టుకునే దిశగా కేసీఆర్ పర్యటనలు సాగుతున్నాయి.
కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తూ...
అయితే కాంగ్రెస్ మాత్రం తాము అధికారంలోకి వచ్చి వంద రోజులు మాత్రమే అయిందని, తాము ఇచ్చిన గ్యారంటీలను అమలు చేస్తామని చెబుతున్నప్పటికీ ఆయన లేదు.. లేదు.. ఇచ్చి తీరాల్సిందేనంటూ పట్టుపడుతున్నారు. రైతులకు బోనస్ ఇచ్చి మరీ పంటను కొనుగోలు చేస్తామంటిరే దాని మాటేమిటంటూ ప్రశ్నలు మీద ప్రశ్నలు వేస్తున్నారు. కేసీఆర్ గతంలోలా కాకుండా తాను అందరికీ అందుబాటులో ఉంటానని పరోక్ష సంకేతాలను పంపుతున్నారు. ఈ ఎన్నికల్లో ఇతర పార్టీలకన్నా ఒక్క సీటు అన్నా ఎక్కువ సాధిస్తేనే నేతలు ఉంటారు. అలా కాకుంటే మాత్రం మిగిలి ఉన్న నేతలు పార్టీలో ఉండరన్న భయం ఆయనలో కనిపిస్తూనే ఉంది. పైకి కొత్త నాయకత్వాన్ని తయారు చేస్తామని బింకాలకు పోతున్నప్పటికీ.. నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు దొరకాలా? వద్దా? అందుకే ఆయన ఎర్రటి ఎండలోనూ కాలికి బలపం కట్టుకుని తిరిగేందుకు సిద్ధమవుతున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాల్సి ఉంది. ఇలా చేస్తూ పోతున్నా .. ఆయనను ఈ ఎన్నికల్లో ప్రజలు ఆదరిస్తారా? లేదా? అన్నది మాత్రం ఎన్నికల తర్వాతనే తేలనుంది.
Next Story