Thu Nov 21 2024 21:12:35 GMT+0000 (Coordinated Universal Time)
Maharashtra Assembly Elections : మరాఠా ఎన్నికల్లో కాంగ్రెస్ వెనకడుగు వేయడానికి కారణమిదేనా?
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీల విషయంలో ఒకింత వెనకడుగు వేసింది
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ హైకమాండ్ కు అసలు తత్వం బోధపడినట్లు లేదు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అలివి కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక చతికలపడుతుంది. కర్ణాటక, తెలంగాణలో ఆరు గ్యారంటీలంటూ ప్రజల వద్దకు వెళ్లింది. ప్రజలు కూడా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మారు. హస్తం గుర్తుపైనే ఓటు వేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సక్రమంగా కేటాయించకపోవడంతో కొన్ని విమర్శలు తలెత్తుతున్నాయి. ఇష్టమొచ్చినట్లు ఫ్రీ అంటూ వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ యా రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేయకపోవడం కూడా పార్టీకి ఇబ్బందికరంగా మారింది.
కర్ణాటకలో చేతులెత్తేసి...
కర్ణాటకలో చూసుకుంటే ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంతో పాటు ఉచిత విద్యుత్తు అంటూ అనేక ఫ్రీలు ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గాని అసలు విషయం అర్థం కాలేదు. ఉన్న బడ్జెట్ మొత్తాన్ని వీటికే వెచ్చించాల్సి రావడంతో అభివృద్ధి పనులు అటకెక్కాయి. కనీసం రోడ్లు వేయడానికి కూడా నిధులు లేకుండా పోయాయి. ఏ అభివృద్ధి చేపట్టాలన్నా నిధుల లేమి వెక్కిరిస్తూ కనిపిస్తుంది. దీంతో ప్రజలు కూడా ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే సర్కార్ పై అసంతృప్తి ఏర్పడింది. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమయింది. బడ్జెట్ చూసుకోకుండా అధికారంలోకి రావడమే లక్ష్యంగా స్థానిక నాయకత్వాలు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి.
గ్యారంటీలను అమలు చేయలేక...
తెలంగాణలోనూ అంతే. ఒకటో రెండో గ్యారంటీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేస్తుంది. దీంతో విపక్షాలకు అడ్డంగా కాంగ్రెస్ పార్టీ దొరికి పోతుంది. వారి నుంచి విమర్శలకు సరైన జవాబు చెప్పే పరిస్థిితి కూడా లేదు. హర్యానాలో ఇదే రకమైన హామీలు ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను నమ్మలేదు. ఎక్కువ మంది ప్రజలు ఉచితాలను వ్యతిరేకిస్తున్నట్లు హర్యానా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఎన్నికల విషయంలో ఒకింత జాగ్రత్తలు తీసుకుంటుంది.
ఉచిత హామీలను...
మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా అలివి కాని హామీలు ఇవ్వకూడదని నిర్ణయించుకుంది కాంగ్రెస్ హైకమాండ్. మహారాష్ట్ర బడ్జెట్ చూసి కాని హామీలపై ఒక నిర్ణయానికి రాలేమని స్వయంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వెల్లడించడం ఒకరకంగా పార్టీలో సంచలన నిర్ణయమనే చెప్పవచ్చు. ఇది ఖర్గే ఆలోచన కాకపోవచ్చు. రాహుల్ గాంధీ సీరియస్ గా ఉచిత హామీలపై ఒక నిర్ణయానికి వచ్చినట్లుంది. అందుకే మహారాష్ట్ర ఎన్నికల్లో ఆచితూచి అడుగులు వేస్తుంది. మ్యానిఫేస్టో విడుదల విషయంలో ఒకవిధంగా వాస్తవాలు ప్రతిబింబించేలా ఉండాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు. బడ్జెట్ చూసి హామీలను ప్రజల ముందుంచాలని రాహుల్ భావిస్తున్నారు. పార్టీ షార్ట్కట్ లో విజయం సాధించేకన్నా వాస్తవాలను ప్రజల ముందు ఉంచి వారి మద్దతు కూడగట్టాలన్న ప్రయత్నంలో రాహుల్ గాంధీ అన్నారు.
Next Story