Mon Nov 18 2024 02:30:32 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రూట్లో వస్తే ఇబ్బందేనంటున్న బీఆర్ఎస్
బీఆర్ఎస్కు గుర్తులతో ఇబ్బంది ఎదురవుతుంది. ప్రతి ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తున్న గుర్తులు పంగా మారుతున్నాయి
బీఆర్ఎస్ గుర్తులతోనే ఇబ్బంది ఎదురవుతుంది. ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు. స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తున్న గుర్తులు కారు పార్టీకి శాపంగా మారుతున్నాయి. కొన్ని గుర్తులు కారు గుర్తును పోలి ఉండటంతో ఓటర్లు తికమకపడి వాటిపై వేస్తున్నారని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో ఆరోపిస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ కు కూడా పలుమార్లు ఫిర్యాదు చేసింది. ఉప ఎన్నికలు జరిగినప్పుడు కానీ, సాధారణ ఎన్నికల సమయంలో గాని సింబల్స్ తో గులాబీ పార్టీ అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని పదే పదే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో చివరకు ఇప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
స్వతంత్ర అభ్యర్థులు...
ఎన్నికలు వస్తున్నాయంటే చాలు స్వతంత్ర అభ్యర్థులు పోటీకి ముందుకు వస్తారు. కొందరు టిక్కెట్లు ఆశించి కానీ, మరికొందరు ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇచ్చే డబ్బుల కోసం కావచ్చు నామినేషన్లు వేయడం పరిపాటిగా మారింది. ఈవీఎంలో ఎక్కువ మంది అభ్యర్థులుంటే... పేరులో ఉన్న మొదటి అక్షరం ప్రకారం వరసగా కేటాయింపులు జరుపుతారు. గుర్తులు కూడా అలాగే కేటాయిస్తారు. అదే ఇప్పుడు అధికార బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారింది. వేల సంఖ్యలో ఓట్లు వేరే గుర్తు పడుతుండటంతో కొన్ని చోట్ల ఓటమి అంచుల వరకూ వెళ్లి ఆగిపోవాల్సి వచ్చింది. మరికొన్ని చోట్ల కారు పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు కూడా.
ఫ్రీ సింబల్స్...
ఫ్రీ సింబల్స్ కారు పార్టీ కొంపముంచుతున్నాయి. కెమెరా, చపాతీ రోలర్, రోడ్డు రోలర్, సోప్డిప్, టెలివిజన్, కుట్టుమిషన్, షిప్, ఆటోరిక్షా, ట్రక్ వంటి గుర్తులు పార్టీ అభ్యర్థుల విజయాలను దెబ్బతీస్తాయన్న కలవరం మొదలయింది. స్వతంత్ర అభ్యర్థులను కొన్ని చోట్ల ప్రధాన పార్టీలే రంగంలోకి దింపి గుర్తులతో దెబ్బతీసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కూడా పార్టీ అగ్రనాయకత్వం పసిగట్టింది. గతంలో జాతీయ పార్టీల కంటే ఈ గుర్తులపై పోటీ చేసిన వారికే ఎక్కువ ఓట్లు వస్తుండటంతో ఇప్పుడు బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ఎన్నికల్లో ఈ గుర్తులన్నింటినీ అభ్యర్థులకు కేటాయించకుండా చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై నేడు విచారణ జరగనుంది.
Next Story