Sun Nov 17 2024 22:18:19 GMT+0000 (Coordinated Universal Time)
DK Aruna : డీకే కూడా తప్పుకున్నారే... ఇప్పటికయితే మాత్రం ఈ నిర్ణయమే
అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటానని డీకే అరుణ ప్రకటించారు. తన స్థానంలో బీసీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని తెలిపారు
భారతీయ జనతా పార్టీకి వరస దెబ్బలు తగులుతున్నాయి. ఉన్న నేతలు కూడా పార్టీని వీడి వెళుతున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో చేరికల మాట అటుంచి పార్టీలో కీలకంగా ఉన్న నేతలే అర్ధాంతరంగా రాజీనామా చేసి వెళ్లిపోతున్నారు. నిన్నమొన్నటి వరకూ బీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అంటూ జబ్బలు చరిచిన కమలం పార్టీకి వరస దెబ్బలు కోలుకోకుండా చేస్తున్నాయి. నిన్న కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడగా, నేడు గడ్డం వివేక్ పార్టీకి గుడ్ బై చెప్పి వెళ్లిపోయారు. తాజాగా పార్టీ సీనియర్ నేత డీకే అరుణ కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని తెలిపారు.
ఎన్నికలకు దూరంగా...
అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంటానని డీకే అరుణ ప్రకటించారు. తన స్థానంలో బీజేపీ నుంచి బీసీ అభ్యర్థిని బరిలోకి దింపుతామని ఆమె ప్రకటించడం పార్టీకి కొంత సంకటంగా మారింది. తాను పోటీ చేయబోనని, ప్రచారానికి మాత్రమే పరిమితమవుతానని తెలిపారు. ఇందుకు బలమైన కారణాలు కూడా ఉన్నాయంటున్నారు. ఉమ్మడి మహబూబానగర్ జిల్లాలో ఇప్పుడు బీజేపీకి పెద్దగా పట్టు లేకుండా పోయింది. కాంగ్రెస్ బాగా పుంజుకుంది. బలమైన నేతలందరూ కాంగ్రెస్ లో ఉన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ ఉంది. బీజేపీని ప్రజలు కూడా పెద్దగా లెక్కలోకి తీసుకోవడం లేదన్న అంచనాకు వచ్చారు.
లోక్ సభ ఎన్నికలకు...
అసెంబ్లీ ఎన్నికలకు, లోక్ సభ ఎన్నికలకు ట్రెండ్ వేరే రకంగా ఉంటుంది. అందుకే ఆమె అసెంబ్లీ బరి నుంచి తప్ప కోవాలని నిర్ణయించుకున్నారు. వీలుంటే అప్పటి పరిస్థితులను బట్టి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతారని ఆమె సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. కేవలం పార్టీ గ్రాఫ్ బాగా పడిపోవడంతోనే డీకే ఈ నిర్ణయం తీసుకున్నారన్నది కుటుంబ సభ్యులు కూడా అంగీకరిస్తున్న విషయం. అసెంబ్లీలో మరోసారి పోటీ చేసి ఓటమి పాలు కావడం కంటే వెయిట్ చేసి పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దిగడమే బెటర్ అన్నది ఆమె అభిప్రాయంగా ఉంది. ఇదే విషయాన్ని ఆమె పార్టీ అగ్రనాయకత్వానికి కూడా చెప్పేశారు.
ఆరోజు పరిస్థితులను బట్టి...
లోక్ సభ ఎన్నికల నాటికి పరిస్థితులను బట్టి అప్పుడు పార్టీలో ఉండాలా? లేదా? అన్నది నిర్ణయించుకోవచ్చన్నది డీకే అరుణ అభిమతంగా ఉన్నట్లు కనిపిస్తుంది. అందుకోసమే అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని డీకే అరుణ నిర్ణయించుకున్నారు. సాధారణంగా డీకే అరుణ ఎన్నికలకు భయపడదని ఆమెను దగ్గరనుంచి చూసినవారు చెబుతారు. కానీ ఈసారి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారంటే ఇప్పటికప్పుడు వేరే పార్టీకి మారలేక, ఉన్న పార్టీ లో పోటీ చేసినా గెలవలేమని నిర్ణయించుకున్న తర్వాతనే ఆమె ఈ డెసిషన్ కు వచ్చినట్లు చెబుతున్నారు. ఎంపీలనే పార్టీ నాయకత్వం అసెంబ్లీ బరిలోకి దింపుతుంటే డీకే అరుణ తాను పోటీ చేయనని చెప్పడం అధినాయకత్వానికి కూడా మింగుడుపడటం లేదు. మొత్తం మీద డీకే తీసుకున్న ఈ నిర్ణయంతో బీజేపీకి మరో షాక్ తగిలినట్లయింది.
Next Story