Sun Dec 15 2024 06:08:51 GMT+0000 (Coordinated Universal Time)
Income Tax : దాడులు.. హస్తానికి మరింతగా కలసి వస్తాయా?
తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు
తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు జరుపుతున్నారు. పన్నులు ఎగవేశారన్న కారణంతో ఈ దాడులు చేస్తున్నారని చెబుతున్నారు. కానీ అది పైకి కనిపించే అంశమే. కానీ లోపలకు వెళితే మాత్రం రాజకీయ వేధింపులని చూసే వారికి ఇట్టే అర్థమవుతుంది. గత రెండు రోజులుగా జరుగుతున్న ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడులను చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం కలుగుతుంది. కేవలం కాంగ్రెస్ నేతలనే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు కొనసాగిస్తున్నారు. ఎన్నికల వేళ వారిని ఇబ్బంది పెట్టాలన్న యోచనతోనే ఈ దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు.
దాడులు జరుగుతున్న ఇళ్లన్నీ...
ఐటీ శాఖకు దొరుకుతున్న వాళ్లంతా కాంగ్రెస్ నేతలేనా? అన్న ప్రశ్న కూడా ప్రజల్లో కలుగుతుంది. తొమ్మిదేళ్ల నుంచి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలను, వారికి ఆర్థిక సహాకారం అందిస్తున్న నేతలను వదిలేసి పదేళ్ల నుంచి అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ నేతలపై పడటమేంటన్నది ఐటీ శాఖకు చెడ్డపేరు తెచ్చే విధంగా ఉంది. ఒక ఆదాయపు పన్ను శాఖకు మాత్రమే కాదు.. ఈ దాడులు కాంగ్రెస్ కు తాత్కాలికంగా ఇబ్బంది కలిగించినా ఎన్నికల సమయంలో అధికార బీఆర్ఎస్, బీజేపీలకు సమస్యగా మారతాయన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. రెండు పార్టీల మధ్య బంధం ఐటీ దాడులతో తేలిపోయిందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
రెండు రోజుల నుంచి...
రాహుల్ గాంధీ అలా వచ్చి ఇటు వెళ్లగానే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడంపై కూడా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ నేతలనే ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? వీరు డబ్బులు బయటకు తీయకుండా, ప్రజలకు అందివ్వకుండా ముందుగా భయభ్రాంతులకు గురి చేసే పనిలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయన్న ప్రచారం తెలంగాణలో ఊపందుకుంది. అది అధికార పార్టీ బీఆర్ఎస్ కు కొంత మేర రాజకీయంగా నష్టం కలిగిస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ఈ దాడులతో కాంగ్రెస్ పార్టీ పై సానుభూతి కూడా పెరిగే అవకాశముందన్న అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో వ్యక్తమవుతుంది. చివరకు సీనియర్ నేత జానారెడ్డి కుటుంబాన్ని కూడా వదిలిపెట్టలేదన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ నేతల ఇళ్లలో మాత్రం....?
ఆదాయపు పన్ను శాఖ దాడులు తప్పు కాదు. సమాచారం ఎక్కడి నుంచి వచ్చినా దాడులు చేయవచ్చు. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టే వారిని ఎవరినీ వదలిపెట్టకూడదు. కానీ దాడులు ఏకపక్షంగా జరిగితేనే అసలు సమస్య. ఎన్నికలకు ముందు ఈ నేతల ఇళ్లు ఎందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్న తలెత్తుతోంది. అప్పుటికీ, ఇప్పటికీ ఆదాయంలో ఎగవేత ఎంత ఉంటుందన్నది కూడా వారు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ను పూర్తిగా వదిలేసి కేవలం హస్తం పార్టీపై పడటం కూడా మంచిదికాదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు అంత శుద్దపూసలా? అంటూ కాంగ్రెస్ నేతలు వేస్తున్న ప్రశ్నకు ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. దీంతో ఐటీ దాడులు హస్తం పార్టీకి తాత్కాలికంగా నష్టం చేకూర్చినా.. రానున్న ఎన్నికల సమయంలో కొంత మేర నష్టం కలగక మానదన్న అభిప్రాయం సర్వత్రా వినపడుతుంది.
Next Story