Tue Nov 12 2024 19:43:00 GMT+0000 (Coordinated Universal Time)
అదే జరిగితే ఎవరిది అధికారం... ఎవరికి నష్టం
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పొలిటికల్ సీన్ ఉంది.
తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పొలిటికల్ సీన్ ఉంది. ఎవరిది గెలుపు అనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటా పోటీగా ఉన్నాయి. సర్వేల్లో కాంగ్రెస్ పార్టీదే కొంచెం పై చేయి కనిపిస్తున్నా చివరి నిమిషంలో ఏమవుతుందోనన్న టెన్షన్ అన్ని పార్టీల్లో నెలకొంది. రెండు సార్లు అధికారంలోకి వచ్చిన పార్టీగా కారు పార్టీకి ఈ ఎన్నికలు అంత సులువు కాదు. కానీ అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకున్నప్పటికీ అది అధికారం అందుకునేంతగా అంటే.. చెప్పలేని పరిస్థితి. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న విశ్లేషణలు కూడా ఊపందుకుంటున్నాయి.
హంగ్ వస్తుందన్న...
తెలంగాణలో హంగ్ వస్తుందన్న అంచనాలు నిజమవుతాయా? లేదా? అన్నది పక్కన పెడితే ఈసారి మాత్రం ఫైట్ వన్ సైడ్ మాత్రం కాదన్నది సుస్పష్టం. అది అధికార బీఆర్ఎస్ నేతలకు కూడా తెలుసు. బీజేపీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా కాంగ్రెస్ మాత్రం విజయం అంచు వరకూ వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు నిజమవుతాయని ఎక్కువ మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు కొంత మార్పును కోరుకోవడం వల్లనే కాంగ్రెస్ బలోపేతమయిందని చెబుతున్నారు. కొన్ని రంగాల ప్రజలు అధికార పార్టీపై వ్యతిరేకతతోనే కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం వల్ల ఈసారి ఏకపక్ష గెలుపు బీఆర్ఎస్ కు సాధ్యం కాదన్న కామెంట్స్ వినపడుతున్నాయి.
కాంగ్రెస్ పుంజుకోవడంతో...
కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ బాగా పుంజుకుంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో అయితే క్లీన్ స్వీప్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. అలాగే వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో కూడా మార్పు వచ్చిందని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయమన్న అంచనాలు వినపడుతున్నాయి. హంగ్ అసెంబ్లీ వస్తే ఏ పార్టీ ఎవరికి మద్దతిస్తుందన్న చర్చ కూడా ఇప్పుడు తెలంగాణలో ఊపందుకుంది. బీఆర్ఎస్ తో నేరుగా పొత్తు పెట్టుకోకపోయినా బీజేపీ ఆ పార్టీ పక్షాన నిలుస్తుందన్న వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా నిలువరించడమే బీజేపీ లక్ష్యం కాబట్టి ప్రభుత్వంలో కలవకుండా బయట నుంచి బీజేపీ మద్దతు ప్రకటించే అవకాశాలను కొట్టిపారేయలేం అంటున్నారు.
స్వతంత్ర అభ్యర్థులకు...
ఇక కాంగ్రెస్ కు ఎవరు మద్దతిస్తారన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక ఎమ్మెల్యేల కొనుగోళ్లు కూడా ఎక్కువగా ఉంటాయన్న లెక్కలు వేసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో మంచి ఫైట్ జరుగుతుంది. ఈసారి గెలిచే స్వతంత్ర అభ్యర్థులకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది. అయితే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎంతమంది గెలుస్తారు? ఒకవేళ గెలిచినా వారు ఏ గూటికి చేరతారు? అంటే అప్పటికప్పడు వారికి దక్కే పదవులు, అందే ప్యాకేజీపైనే ఆధారపడి ఉంటుందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మొత్తం మీద హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందన్న విశ్లేషణలతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకత్వం మాత్రం అప్రమత్తమై ప్రచారాన్ని ఉధృతం చేశాయి. మరి చివరకు ఏం జరుగుతుందన్నది చూడాలి.
Next Story