Fri Nov 22 2024 20:16:16 GMT+0000 (Coordinated Universal Time)
బావాబామ్మర్దులపై పోటీకి కాంగ్రెస్ చేస్తున్న కసరత్తు ఇదేనా?
కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది. సిద్ధిపేట, సిరిసిల్లలో బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తుంది.
కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా వచ్చేసింది. అందులో ముఖ్యమైన నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. చివరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్ కు కూడా అభ్యర్థిని కాంగ్రెస్ అధినాయకత్వం త్వరగానే కన్ఫర్మ్ చేసింది. కేసీఆర్ పై నరసారెడ్డిని పోటీకి దింపేందుకు సిద్ధమయ్యారు. గజ్వేల్ లో పోటీ ఇస్తారా? లేదా? అన్నది పక్కన పెడితే ఆ రెండు చోట్ల పార్టీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతున్నట్లు తెలిసింది. సిరిసిల్ల, సిద్ధిపేటల్లో ధీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ పార్టీ అన్వేషిస్తుంది. అందువల్లనే తొలి జాబితాలో ఈ రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయకుండా వదిలేసింది. ఆపరేషన్ ఎస్ ను ప్రారంభించింది. సిద్ధిపేట, సిరిసిల్లలో ఎవరిని దింపాలన్న దానిపై పెద్దయెత్తున సర్వేలు కూడా చేయించినట్లు తెలిసింది.
కట్టడి చేయడానికే...
గత పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్‌లో కేసీఆర్ కవిత ఓటమి పాలయ్యారు. కవితపై బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఊహించని స్థాయిలో విజయం అందుకున్నారు. అయితే ఈసారి శాసనసభ ఎన్నికల్లో ఈ ఇద్దరినీ కట్టడి చేసేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం తీవ్రంగానే శ్రమిస్తుందని తెలుస్తోంది. కేసీఆర్ తనయుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్‌రావును వారి నియోజకవర్గానికే పరిమితం చేయగలిగితే తాము 90 శాతం విజయం సాధించినట్లేనన్న ఆలోచనలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
నాలుగు సార్లు గెలిచి...
సిద్ధిపేటకు హరీశ్‌రావు, సిరిసిల్లకు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిరిసిల్లలో కేటీఆర్ ఇప్పటి వరకూ నాలుగు సార్లు విజయం సాధించారు. 2009, 2014, 2018 ఎన్నికల్లో ఆయన విక్టరీ కొట్టారు. మధ్యలో ఒక ఉప ఎన్నికలో కూడా ఆయన విజయం సాధించారు. ఆయనకు ప్రత్యర్థిగా కెకె మహేందర్ రెడ్డి గతంలో పోటీ చేసి వరస ఓటములను చూసి అలసి పోయి ఉన్నారు. ఈసారి సిరిసిల్లకు ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై కాంగ్రెస్ పెద్దయెత్తున కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపితే కేటీఆర్ సిరిసిల్ల గడప దాటకుండా చేయవచ్చన్న ఆలోచనకు ఆ పార్టీ నాయకత్వం వచ్చినట్లు తెలిసింది. అందుకే దానిపై ఇంకా ఒక క్లారిటీకి రాలేదు.
ఆరుసార్లు విక్టరీ కొట్టి...
ఇక సిద్ధిపేట్ కూడా అంతే. కేసీఆర్ కు కుడిచేయి వంటి వారు హరీశ్ రావు. సిద్ధిపేట్ ను తన అడ్డాగా చేసుకున్నారు. కేసీఆర్ 1985 నుంచి సిద్ధిపేట నుంచి ఆరు సార్లు గెలిస్తే.. మేనల్లుడు హరీశ్ రావు కూడా అదే అంకెను చేరుకున్నారు. మరో సారి గెలిస్తే మామ రికార్డును బ్రేక్ చేసినట్లే అవుతుంది. 2004 లో జరిగిన ఉప ఎన్నిక నుంచి 2018 వరకూ ఆరు సార్లు హరీశ్ రావు సిద్ధిపేట్ నుంచి గెలిచారు. అయితే ఇక్కడ కాంగ్రెస్‌కు సరైన అభ్యర్థి దొరకడం లేదు. అభ్యర్థులను మార్చి మార్చి నిలబెడుతున్నా ఇక్కడ ప్రయోజనం లేకుండా పోయింది. అందుకే ఈసారి బలమైన నేతను సిద్ధిపేట్ నుంచి రంగంలోకి దించాలని చూస్తున్నారు. మరి ఈ రెండు చోట్ల కేటీఆర్, హరీశ్‌రావులను ఢీకొనే నేత ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Next Story