Thu Dec 19 2024 13:07:09 GMT+0000 (Coordinated Universal Time)
మునుగోడు నుంచే నా పోటీ : రాజగోపాల్ రెడ్డి
మళ్లీ మునుగోడు నుంచే తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.
మళ్లీ మునుగోడు నుంచే తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. మునుగోడును వదిలే ప్రసక్తి లేదని ఆయన తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ బలంగా ఉందని, కేసీఆర్ ను ఓడించగలుగుతుందని భావించి తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి వెళ్లానని ఆయన తెలిపారు. కానీ బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని తేలిపోయిందన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయకపోవడానికి మించి ఉదాహరణ ఏం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.
రిటర్న్ గిఫ్ట్ ఇస్తా...
నాడు మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో అన్ని శక్తులు ఏకమై తనను ఓడించారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే తాను గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని చెప్పారు. డబ్బు అధికారంతో మునుగోడులో గెలిచారన్న ఆయన గజ్వేల్ లో పోటీ చేసి ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని ఉందని తెలిపారు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ అందుకు అంగీకరించాలన్నారు. తనను ఎల్.బి. నగర్ నుంచి పోటీ చేయాలని కూడా తన అభిమానులు కోరుతున్నారని, కానీ తాను మాత్రం మునుగోడు నుంచే పోటీ చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు.
గద్దె దించడమే...
కేసీఆర్ను గద్దె దించడమే తన లక్ష్యమని, తెలంగాణ సమాజం కోసమే తాను ఆలోచిస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు. తాను బీజేపీలో చేరితే కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయారన్నారని, అప్పుడు విమర్శించిన వాళ్లు ఇప్పుడు ఏమంటారని ఆయన ప్రశ్నించారు. దమ్ముంటే కేసీఆర్ మునుగోడులో పోటీ చేయాలన్నారు. మునుగోడులో తనను ఓడగొట్టటం ఎవరి వల్ల కాదన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. తనను కొనే శక్తి ప్రపంచంలో ఎవరికీ లేదన్నారు.
Next Story