Mon Dec 23 2024 07:08:47 GMT+0000 (Coordinated Universal Time)
Janasena : ఏపీలో ఒకలా.. తెలంగాణలో మరొకలానా?
ఏపీలో జనసేన పొత్తును ఖరారు చేసుకుంది. కానీ తెలంగాణలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ఇంకా ఏడు నెలల సమయం ఉంది. అయినా సరే అక్కడ పొత్తులు ఖరారయ్యాయి. విపక్ష పార్టీలైన తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకున్నాయి. ఈరోజు రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం కూడా జరగనుంది. రాజమండ్రిలో జరుగుతున్న ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. వస్తే.. గిస్తే బీజేపీని కలుపుకుని పోతామని అటు పవన్ కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. చంద్రబాబు కూడా బీజేపీతో పొత్తుపట్ల సుముఖంగానే ఉన్నారు. కానీ బీజేపీ నుంచి మాత్రం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏపీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండటంతో పొత్తు ప్రకటన ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. బహుశ తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశముంది.
తెలంగాణలో మాత్రం...
కానీ తెలంగాణలో మాత్రం అలా కాదు. కేవలం నలభై రోజుల్లో శాసనసభ ఎన్నికలున్నాయి. ఇంత వరకూ టీడీపీ తన అభ్యర్థులను ప్రకటించలేదు. పొత్తు విషయంపై కూడా స్పష్టం చేయలేదు. ఏపీలో అధికారికంగా పొత్తు ఉంది కాబట్టి తెలంగాణలోనూ జనసేనతో అలయెన్స్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ ఇంత వరకూ తెలంగాణలో టీడీపీ, జనసేనల మధ్య పొత్తుపై ఎలాంటి చర్చలు జరగలేదు. పైగా జనసేన అధినేతతో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని కోరినట్లు చెబుతున్నారు. రెండు, మూడు రోజుల్లో తెలంగాణలో పోటీ చేసేదీ లేనిదీ ప్రకటిస్తానని పవన్ ప్రకటించారు. ఇప్పటి వరకూ దీనిపై పవన్ నుంచి ప్రకటన రాలేదు.
టీడీపీని కాదని...
మరోవైపు జనసేనాని వద్దకు వెళ్లిన బీజేపీ నాయకులు టీడీపీని మాత్రం పట్టించుకోలేదు. ఇటీవల కేంద్రహోంమంత్రి అమిత్ షాను నారా లోకేష్ కలవడంతో తెలంగాణలో పొత్తు ప్రారంభమై ఏపీలో కొనసాగుతుందని అందరూ భావించారు. కానీ బీజేపీ తన తొలి జాబితాను ప్రకటించింది. 52 మంది అభ్యర్థులతో ఉన్న జాబితాలో టీడీపీకి బలమున్న స్థానాల్లోనూ అభ్యర్థులను ప్రకటించడంతో ఇక్కడ టీడీపీతో పొత్తుకు బీజేపీ సిద్ధమయినట్లు కనిపించడం లేదు. జనసేనతో కూడా నేరుగా పొత్తు పెట్టుకునే అవకాశాలు లేవని, కేవలం పవన్ కల్యాణ్ మద్దతు మాత్రమే కోరుకుంటున్నారని పర్ాటీ వర్గాలు చెబుతున్నాయి.
అందుకేనా..?
తెలంగాణలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా రెండు పార్టీలతో నేరుగా పొత్తు పెట్టుకునే అవకాశం లేదంటున్నారు. మరోసారి ఆంధ్ర, తెలంగాణ వాదాన్ని తీసుకువచ్చి బీఆర్ఎస్ అధినేతకు ప్రయోజనం చేకూర్చడమెందుకన్న ధోరణిలోనే టీడీపీతో బీజేపీ పొత్తుకు దూరంగా ఉంటుందా? లేక ఏపీలోనూ ఇదే పంథాను కొనసాగిస్తుందా? అన్న చర్చ జరుగుతుంది. మొత్తం మీద బీజేపీ గేమ్ ప్లాన్ ఏంటో అర్థం కాని టీడీపీ మాత్రం తన పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధమయింది. చంద్రబాబు ఆమోద ముద్ర వేయగానే లిస్ట్ ను ప్రకటించే అవకాశముంది. మరి జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తారా? లేదా? అన్నది కూడా త్వరలోనే తేలనుంది.
Next Story