Mon Dec 23 2024 11:23:04 GMT+0000 (Coordinated Universal Time)
Revanth Reddy : అంజనీకుమార్, స్టీఫెన్ రవీంద్రలను బదిలీ చేయాల్సిందే
కాంగ్రెస్ పార్టీ తరుపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ తరుపు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ కు మద్దతిస్తున్న అధికారులను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలిపారు. సోమేష్ కుమార్, అరవింద్ కుమార్, జయేష్ రంజన్ వంటి అధికారులు ఎన్నికలలో బీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నారన్నారు. స్టీఫెన్ రవీంద్రను కూడా బదిలీ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కోరిందన్నారు. రిటైర్డ్ అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కూడా కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
ఎన్నికల విధుల నుంచి...
ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే ఈ అధికారులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని కోరామన్నారు. నవంబరు రెండో తేదీలోపు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నిధులను విడుదల చేయాలని తాము కోరామన్నారు. అంతే తప్ప సంక్షేమ పథకాలను ఆపమని తాము కోరలేదని ఆయన తెలిపారు. అంజనీకుమార్, స్టీఫెన్ రవీంద్రను బదిలీ చేయాలని కోరామని తెలిపారు. అధికారిక భవనాల్లో రాజకీయ కార్యకలాపాలు జరగకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ ను కోరినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు.
పారిశ్రామికవేత్తలను బెదిరిస్తూ...
కాంగ్రెస్ పార్టీకి నిధులు ఇవ్వవద్దంటూ పారిశ్రామికవేత్తలను అధికారులను బెదిరిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాసుల కోసం కక్కుర్తి పడి నాసిరకంగా నిర్మాణం చేపట్టారన్నారు. దానిని నిర్మించిన కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. మేడిగడ్డ కాదు.. కేసీఆర్ రాజ్యం కుంగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. రిటైర్డ్ అధికారులు ప్రయివేటు ఆర్మీలా పనిచేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ అంశం నుంచి కేసీఆర్ ను కాపాడేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. మేడిగడ్డను కావాలని డ్యామేజీ చేశారని మావోయిస్టులపై నెట్టాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాల్గొన్నారు.
Next Story