Fri Nov 22 2024 20:59:45 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ను ఆశీర్వదించండి : ప్రియాంక
తెలంగాణలో కాంగ్రెస్ వల్లనే సామాజికన్యాయం జరుగుతుందని ప్రియాంక గాంధీ అన్నారు
తెలంగాణలో కాంగ్రెస్ వల్లనే సామాజికన్యాయం జరుగుతుందని ప్రియాంక గాంధీ అన్నారు. రామప్ప ఆలయం లాంటి దేవాలయాన్ని తాను ఎప్పుడూ చూడలేదన్నారు. ములుగు సభలో ప్రియాంక గాంధీ ప్రసంగించారు. తెలంగాణ వచ్చిన తర్వాత మీ కలలన్నీ నిజమవుతాయని భావించారన్నారు. ఎన్నో ఆశలతో తెలంగాణను తెచ్చుకున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీ కలలను, ఆశలను అర్థం చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి నాటి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నప్పుడు రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుసునని అన్నారు.
దీర్ఘకాలిక ప్రయోజనం కోసమే...
కానీ సోనియా గాంధీ తెలంగాణ ప్రజల కోసమే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇక్కడి ప్రజల ఆకాంక్ష మేరకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తాత్కాలిక ప్రయోజనాల కోసం సోనియా తెలంగాణ ఇవ్వలేదన్నారు. భవిష్యత్ ను దూరదృష్టిలో పెట్టుకుని సమాజం మంచి కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ హయాంలో తెలంగాణలో పెద్దపెద్ద సంస్థలు ఏర్పడ్డాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమంటే ప్రజా ప్రభుత్వమని ఆమె అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు నీతి నిజాయితీతో కట్టుబడి ఉంటాయని అన్నారు.
అవినీతిలో ప్రభుత్వం...
ప్రస్తుత ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ప్రియాంక గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ఒక రోడ్డు మ్యాప్ను తయారు చేసి మీ ముందుకు వస్తుందన్నారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ మీ ముందుకు తీసుకు వచ్చిందన్నారు. తెలంగాణలో నలభై లక్షల మంది పిల్లలు నిరుద్యోగులుగా మిగిలిపోయారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని, కానీ ఉద్యోగాల ఖాళీని భర్తీ చేయలేదన్నారు. ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని, అనేకమంది యువతీయువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.
రైతులకు గిట్టుబాటు...
ఈరోజు అన్ని ధరలు పెరిగాయని, అందుకు తగినట్లుగా ఉపాధి అవకాశాలు పెరగడం లేదన్నారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఖాళీగా ఉన్న రెండున్నర లక్షల ఉద్యోగాలు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా భర్తీ చేస్తామని ప్రియాంక హామీ ఇచ్చారు. రైతుల పరిస్థితి మరింత దయనీయంగా తయారయిందన్నారు. వ్యవసాయంలో ఆదాయం పడిపోయిందని, తాము అధికారంలోకి రాగానే కనీస గిట్టుబాటు ధరలను కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని చెప్పారు. ప్రతి ఎకరానికి ప్రతి ఏడాది పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీ కలసి పోయిందన్నారు. ఈ అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని ప్రియాంక పిలుపునిచ్చారు. సీతక్కను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Next Story