Fri Dec 20 2024 07:14:44 GMT+0000 (Coordinated Universal Time)
Communists : పొత్తుల కోసం వెంపర్లాడుతూ.. ప్రజాసమస్యలు పట్టించుకోక... ఈగతి
కామ్రేడ్లకు కాలం కలసి రావడం లేదు. ఎవరూ కలుపుకుని పోవడం లేదు. అసలు వారికి ఉన్న బలంపై ఇతర పార్టీలకే నమ్మకం లేదు
కామ్రేడ్లకు కాలం కలసి రావడం లేదు. ఎవరూ కలుపుకుని పోవడం లేదు. అసలు వారికి ఉన్న బలంపై ఇతర పార్టీలకే నమ్మకం లేదు. అందుకే కమ్యునిస్టు పార్టీలను అన్ని పార్టీలూ పక్కన పెడుతున్నాయి. గత దశాబ్దకాలంగా కమ్యునిస్టు పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇబ్బంది పడుతున్నాయి. ఏపీలో అయితే పదేళ్ల నుంచి అసలు శాసనసభలో అడుగు పెట్టలేదు. ఈసారైనా కాలుమోపేందుకు కమ్యునిస్టు పార్టీలు టీడీపీతో జత కట్టడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవేళ టీడీపీ, జనసేనలతో బీజేపీ కలిస్తే ఏపీలోనూ కమ్యునిస్టులు ఒంటరిగా పోటీ చేయాల్సిందే. ఒంటరిగా పోటీ చేస్తే వారి బలమేంతో వారికి తెలుసు. మళ్లీ ఒక్కరు కూడా గెలిచే అవకాశం లేదు.
బీఆర్ఎస్ తో పొత్తుకోసం...
తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు కుదురుతుందని కామ్రేడ్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తమ మద్దతును కేసీఆర్ స్వయంగా కోరడంతో ఇక వచ్చే ఎన్నికల్లో తాము చట్ట సభల్లోకి అడుగుపెడతామని ఆశపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలలో బేషరతుగా మద్దతిచ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ కమ్యునిస్టులను పట్టించుకోలేదు. అప్పటి వరకూ కౌగిలింతలతో ముంచెత్తిన కేసీఆర్ ఆ ఉప ఎన్నిక తర్వాత వారి వైపు కూడా చూడటం లేదు. దీంతో పాటు తాను 119 నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ ప్రకటనతో వామపక్ష పార్టీలు మరోసారి నిరాశకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా ప్రజా సమస్యలపై పోరాటం తగ్గించినందునే కామ్రేడ్లు ప్రజల్లో వీక్ అయపోయారన్నది ఒక వాదన కాగా, మారుతున్న జనరేషన్ కూడా రెడ్ బ్రదర్స్ పలుచన కావడానికి కారణమన్న విశ్లేషణలు వినపడుతున్నాయి.
కాంగ్రెస్ తో అయినా...
బీఆర్ఎస్ పోతే పోయింది. కాంగ్రెస్ తో జతకడితే చాలు అన్న ధోరణితో వారు హస్తం పార్టీకి దగ్గరయ్యారు. ఆ పార్టీ నేతలతో మంతనాలు జరిపారు. తమకు నాలుగు సీట్లు ఇచ్చినా చాలునని బేరాలాడారు. అంటే సీపీఐకి నాలుగు, సీపీఎంకు నాలుగు ఇవ్వాలన్న ప్రతిపాదన ముందు కాంగ్రెస్ పార్టీ నేతలకు చెప్పారు. అయితే కుదరదంటే ఇద్దరికీ కలిపి నాలుగే నాలుగంటూ బతిమాలుకున్నారు. పోనీ రెండు సీట్లే కదా? అని కాంగ్రెస్ ఇస్తుందని గట్టిగా భావించారు. సీపీఐకి కొత్తగూడెం, చెన్నూరు, సీపీఎంకు మిర్యాలగూడ, పాలేరు కావాలని అడిగారు. లేకుంటే భద్రాచలం, వైరా అయినా ఇవ్వాలని కోరారు. అయితే కాదు.. కాదు.. తమకు బలం ఉన్న చోట ఎలా ఇస్తాం కుదరదని కాంగ్రెస్ చెప్పింది. చెరి ఒక్క సీటే ఇస్తామని వీలయితే కలసి రావాలని సంకేతాలు ఇచ్చింది. కావాలంటే హైదరాబాద్ నగరంలో ఒక స్థానం ఇచ్చేందుకు సిద్ధమని తెలిపింది.
కానీ కష్టమేనంటున్న కాంగ్రెస్...
దీంతో కామ్రేడ్లు డీలా పడ్డారు. తాజాగా కాంగ్రెస్ లోకి గడ్డం వివేక్ చేరడంతో ఆయన చెన్నూరు నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయన కుమారుడు వంశీకి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు టిక్కెట్ ఇచ్చేవిధంగా అగ్రిమెంట్ కుదిరిందంటున్నారు. ఇక కొత్తగూడెం సీటు కూడా అక్కడ ఉన్న జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకోవడం ద్వారా అక్కడ కూడా సీపీఐకి ఇచ్చే అవకాశం లేదు. ఇక మిర్యాలగూడలో కాంగ్రెస్ కు బలం ఉంది. ఆ స్థానాన్ని కూడా వదులుకోలేదల్చుకోలేనట్లుంది. ఏతావాతా తేలిందేమిటంటే.. కామ్రేడ్ల పరిస్థిితి ఎక్కే గడపా.. దిగే గడపా అన్నట్లు తయారైంది. వీళ్లు ఒంటరిగా పోటీ చేసినా పెద్దగా ప్రమాదం లేదని భావించిన పార్టీలు వారిని పక్కన పెడుతున్నాయి. ఇప్పుడు కమ్యునిస్టు పార్టీలకు ఒకటే మార్గం. సొంతంగా బరిలోకి దిగడం. మళ్లీ వచ్చే ఎన్నికల వరకూ ఎదురు చూపులు చూడటం.
Next Story