Mon Dec 23 2024 13:56:09 GMT+0000 (Coordinated Universal Time)
ఎంపీలు ముగ్గురు శాసనసభకే... రాజీనామా చేస్తారా?
గత ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులుగా గెలిచిన వారికి మాత్రం కాంగ్రెస్ అధిష్టానం తొలి జాబితాతోనే సీటు దక్కింది.
తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు మరో ఏడు నెలల సమయం ఉంది. అయితే గత ఎన్నికల్లో పార్లమెంటు సభ్యులుగా గెలిచిన వారిని మాత్రం తొలి జాబితాతోనే సీటు దక్కింది. ఇది తొలి నుంచి ఊహిస్తున్నదే. ముగ్గురూ సీనియర్ నేతలు కావడం, పట్టున్న లీడర్లే కావడంతో తొలి నంుచి ఈ అంచనాలు వినపడుతున్నాయి. సామాజికపరంగా, ఆర్థికంగా బలమైన నేతలు కావడంతో ముగ్గురు ఎంపీలకూ కాంగ్రెస్ అధినాయకత్వం టిక్కెట్ ఖరారు చేసింది. తొలి జాబితాలోనే ఈ ముగ్గురు స్థానం సంపాదించుకున్నారు.
కొడంగల్ నుంచి...
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులోనూ ఉన్నారు. దీంతో ఆయన కొడంగల్ నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డిని ప్రకటించారు. 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలు కావడంతో ఆ తర్వాత జరిగిన పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి విజయం సాధించారు. మరోసారి కొడంగల్ నుంచి పోటీ చేసి రేవంత్ రెడ్డి తన అదృష్టాన్ని పరిశీలించుకోనున్నారు.
హుజూర్ నగర్ నుంచి...
మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అంతే. ఆయన నల్లగొండ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో హుజూర్ నగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ సూచన మేరకు ఆయన శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కానీ మరోసారి ఆయన అసెంబ్లీ ఎన్నికల బరిలో కాలు దువ్వేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు కాంగ్రెస్ అధినాయకత్వం హుజూర్ నగర్ నియోజకవర్గం సీటును ఖరారు చేసింది. ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. కాంగ్రెస్ కు పీసీసీ చీఫ్ గా పనిచేసిన ఆయన రెండుసార్లు అధికారంలోకి మాత్రం తేలేకపోయారు.
నల్గగొండ నుంచి...
కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా సీనియర్ నేత. సీఎం రేసులో తాను ఉన్నానని చెప్పుకుంటుంటారు. కోమటిరెడ్డి గత ఎన్నికల్లో నల్లగొండ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో భువనగిరి పార్లమెంటుకు పోటీ చేసి విజయం సాధించారు. ఈసారి ఆయనకు కాంగ్రెస్ అధిష్టానం నల్లగొండ టిక్కెట్ ను కేటాయించింది. తొలి జాబితాలోనే ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు స్థానాలను కేటాయించడంతో వారు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా కొన్ని నెలలు మాత్రమే ఉండటంతో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం.
Next Story