Mon Mar 31 2025 18:33:38 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : ఆల్ గుడ్ ఫీల్ తో అధికారుల బురిడీ... అసలు వాస్తవ పరిస్థితి ఏంటంటే?
రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. అనేక పంటలకు కనీసం తాము పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు

రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అనేక పంటలకు కనీసం తాము పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రం అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు. అంతా బాగుందంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో రైతులు పడే ఇబ్బందులు మాత్రం తెలియజేయడం లేదు. ఈ ఏడాది అనేక పంటలకు గిట్టుబాటు ధరలు రావడం లేదన్నది వాస్తవం. ఆ పరిస్థితిని దాచిపెట్టేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనికి మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా మాయ చేస్తున్నారు. అసలు లెక్కలు మాత్రం రైతులకు ఏ మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదన్నది వాస్తవం.
అన్ని పంటలకు...
పత్తి, వంగ, టమాటా, కంది, మిరపా ఇలా అన్ని పంటలు రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్ కు తీసుకు వచ్చి నష్టపోతున్నారు. ఎందుకంటే మార్కెట్ యార్డులో దళారుల ప్రమేయం మాత్రం బాగా ఉంటుంది. అదే సమయంలో వ్యాపారులు కూడా కావాలని ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. అధికారులు మాత్రం భలే ధర వచ్చిదంటూ జబ్బలు చరుచుకునేలా నివేదికలు సమర్పిస్తున్నారు. రైతుల పరిస్థితిని తెలియజేసే అధికారులు ఇచ్చే నివేదికల్లో వాస్తవం పాళ్లు తక్కువగా ఉండటంతో దానిపై ప్రభుత్వం కూడా చర్యలకు దిగడం లేదు. ఈరోజు మిర్చి రైతులతో చంద్రబాబు నేరుగా సమావేశం అవుతున్నారు కాబట్టి గుంటూరు మిర్చి యార్డులో జరుగుతున్న వాస్తవ పరిస్థితి తెలియనుంది.
తప్పుడు లెక్కలతో...
మిర్చికి క్వింటా రకాన్ని బట్టి తొమ్మిది నుంచి పదకొండు వేల రూపాయల లోపే కొనుగోలు చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం చంద్రబాబు నాయుడుకు పన్నెండు వేల నుంచి పథ్నాలుగు వేలు కొనుగోలు అమ్మడవుతున్నట్లు లెక్కలు చెబుతున్నారు. సన్న మిర్చి ఇరవై క్వింటాళ్ల దిగుబడి వచ్చినా కేవలం రెండు లక్షలే వస్తుంది. కానీ ఎకరానికి పెట్టుబడి రెండు లక్షల డెబ్భయి అయిదు వేల రూపాయలు అవుతుంది. దాదాపు ఎకరానికి ఈ లెక్కన 75 వేల రూపాయల నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. మిర్చి రైతులు ఎందుకు అంతగా అందోళన చేస్తున్నారన్నవిషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లకుండా అధికారులు జాగ్రత్తలు పడ్డారు. ఈరోజు నేరుగా రైతులతో సమావేశంలో వాస్తవ పరిస్థితులు వెల్లడయి తగిన నిర్ణయం తీసుకుంటే మిర్చి రైతుకు కొంతైనా గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశముంది.
Next Story