IPL 2024 : ఇద్దరినీ విడదీయకపోవడంతో చెన్నై రుచి చూసిన నష్టం విలువ ఎంతో తెలుసా?

చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరకు గుజరాత్ నే విజయం వరించింది.

Update: 2024-05-11 06:00 GMT

ఐపీఎల్ లో మనం గెలుస్తుందని భావించిన జట్టు చతికలపడుతుంది. అన్ని ఫార్మాట్లలో విఫలమవుతుంది. కొన్ని జట్లు పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ప్లే ఆఫ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. చెమటోడుస్తున్నాయి. ఐపీఎల్ ఏ జట్టులోనైనా ఇద్దరి భాగస్వామ్యాన్ని విడదీయకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇద్దరు క్రీజులో పాతుకుపోతే పరుగుల వరద పారుతుంది. అందుకే వికెట్లు వెంట వెంటనే తీయడం బౌలర్లకు ఎంత ముఖ్యమో.. ఉన్న కాసేపట్లో స్కోరు బోర్డును పరుగులు తీయించడం బ్యాటర్లకు అంతే ముఖ్యం. ఏ మాత్రం జోడీని విడదీయలేకపోతే అందుకు తగిన ప్రతిఫలం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. చెన్నై విషయంలోనూ అదే జరిగింది. జోడీని విడదీయలేక చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు ఎన్ని పాట్లు పడ్డారో చూసిన వారికి ఇట్టే అర్థమవుతుంది.

గడగడలాడించి...
నిన్న చెన్నై సూపర్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో చివరకు గుజరాత్ నే విజయం వరించింది. చెన్నై మరోసారి ఓటమి పాలయింది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇది కొంతలో కొంత ఊరట అని ఆ జట్టు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టులో ఓపెనర్లు ఇద్దరూ ఊచకోత కోశారు. సాయి సుదర్శన్, శుభమన్ గిల్ ఇద్దరూ నిలబడి సెంచరీ చేశారంటే ఏ రేంజ్ లో వాళ్లు ఆడారో చెప్పకనే తెలుస్తుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. సిక్సర్లు.. ఫోర్లు బాదుతూ స్కోరును చెన్నైకి అందకుండా చేయగలిగారు. ఇద్దరినీ విడదీయడం చెన్నైలోని ఏ బౌలర్ కు సాధ్యం కాలేదు. స్పిన్నర్లను, పేసర్లను బాది అవతలపారేశారు.
ఛేదనలో మాత్రం...
ఇద్దరూ సెంచరీలు చేశారు. గుజరాత్ టైటాన్స్ మొత్తం ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 231 పరుగుల చేసింది. వీటిలో శుభమన్ గిల్ 104 పరుగులు చేయగా, సాయి సుదర్శన్ 103 పరుగులు చేసి అతిపెద్దభాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తర్వాత ఛేదనలో బరిలోకి దిగిన చెన్నై జట్టు ఆదిలోనే వికెట్ కోల్పోయింది. రహానే ఒక్క పరుగుకే అవుట్ అయ్యాడు. రచిన్ కూడా ఒక్క పరుగు చేసి వెనుదిరిగి వెళ్లిపోయాడు. రుతురాజ్ డకౌట్ కావడంతో చెన్నై అపజయం ఖారారయింది. మిచెల్ ఒక్కడే నిలబడి అరవై పరుగులు చేయడంతో కొంత జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. మొయిన్ ఆలీ 56 పరుగుల చేశాడు. చివరకు ఇరవై ఓవర్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఎనిమిది వికెట్లు కోల్పోయి 196 పరుగుల మాత్రమే చేసింది. క్యాచ్ లు మిస్ చేయడం కూడా చెన్నై పాలిట శాపంగా మారిందనే చెప్పాలి.


Tags:    

Similar News