IPL 2024 : ఇంత విధ్వంసమేంటి సామీ.. ఇలాగయితే మిగిలిన జట్ల పరిస్థిత ఏంటి భయ్యా?

రాజస్థాన్ రాయల్స్ తో ముంబయి ఇండియన్స్ జరిగిన మ్యాచ్ లో రాయల్స్ జట్టు సునాయాస విజయం సాధించింది

Update: 2024-04-23 03:52 GMT

ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు దూసుకుపోతుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలుస్తూ వెళుతుంది. మమ్మలి ఎవడు కొట్టేది అంటూ ఒకరు కాకపోతే మరొకరు రాయల్స్ జట్టులో క్లిక్ అవుతుండటంతో ఎంతటి స్కోరునయినా సునాయాసంగా విజయం సాధిస్తుంది. ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లు ఆడితే ఒకే ఒక మ్యాచ్ లో ఓటమి పాలయింది. ఆరు మ్యాచ్ లలోనూ అది గెలిచి సత్తా చాటింది. నిజంగానే పేరుకు తగినట్లుగానే ఐపీఎల్ లో రాయల్స్ గా నిలిచింది. ఒకటా.. రెండా.. ఎన్నిమార్లు ఎన్నిజట్లు ప్రయత్నించినా రాజస్థాన్ రాయల్స్ జట్టును ఓడించలేకపోయారంటే నిజంగా ఆ జట్టు ఈ సీజన్ లో కప్పు కొట్టడానికి అర్హత సాధించినట్లేనని ఫ్యాన్స్ గొప్పగా చెప్పుకుంటున్నారు.

సునాయాసంగా...
రాజస్థాన్ రాయల్స్ తో ముంబయి ఇండియన్స్ జరిగిన మ్యాచ్ లో రాయల్స్ జట్టు సునాయాస విజయం సాధించింది. పెద్దగా అవసరం లేకుండానే కేవలం ఒక వికెట్ ను కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ముందు బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ ఆరంభంలో తడబడింది. మూడు కీలక వికెట్లను సమర్పించుకుంది. దీంతో అది కష్టాల్లో పడినట్లయింది. అయితే మనోడు.. మన హైదరాబాదీ తిలక్ వర్మ నిలబడి ఆడటంతోనే ఆ మాత్రం స్కోరు అయినా లభించింది. లేకుంటే అతి తక్కువ స్కోరుకు ఆల్ అవుట్ అయి మరోసారి ముంబయి ఇండియన్స్ నవ్వుల పాలయ్యేది. ఎలాగోలా తిలక్ వర్మ పుణ్యమా అని మంచి స్కోరు సాధించింది.
వరసగా అవుటయి...
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయ్ జట్టులో రోహిత్ శర్మ ఆరు పరుగులకు అవుట్ అయ్యారు. ఇషాన్ కిషన్ కూడా ఫెయిలయ్యాడు. కేవలం పది పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఇక తర్వాత వచ్చిన తిలక్ వర్మ దూకుడుగా ఆడి 65 పరుగులు చేశాడు. ఇందుకు 45 బంతులు వినియోగించుకోనున్నాడు. ఇందులో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లున్నాయి. నేహాల్ వధేరా కూడా బాగా ఆడాడు. ఒక్క పరుగు తేడాతో అర్థ శతకం మిస్ చేసుకున్నాడు. నబీ 23 పరుగులు చేశాడు. మొత్తం మీద ఇరవై ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 179 పరుగులు మాత్రమే చేసింది. అత్యంత తక్కువ పరుగులకే ఇన్నింగ్స్ ను ముగించారు.
ఒక్క వికెట్ కోల్పోయి...
తర్వాత 180 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు వెనక్కు తిరిగి చూసుకోలేదు. ఓపెనర్ గా దిగిన యశస్వి జైశ్వాల్ 104 పరుగులు చేశాడు. సెంచరీ బాది ముంబయిని చావుదెబ్బతీశాడు. కేవలం అరవై బంతుల్లోనే 9 ఫోరలు, ఏడు సిక్సర్లు బాది శతకాన్ని కొట్టేశాడు. బట్లర్ 35 పరుగులు చేసి అవుటయ్యాడు. కెప్టెన్ సంజు శాంసన్ 38 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ముంబయి కథను రాజస్థాన్ అలా ముగించేసింది. రాజస్థాన్ రాయల్స్ పై ఈ మ్యాచ్ గెలిచి ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుందామని భావించిన ముంబయి ఇండియన్స్ ఆశలను యశస్వి జైశ్వాల్ అడియాసలు చేశాడు.
Tags:    

Similar News